POCSO Act | తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఇప్పుడొక కేసు గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు, నిందితుడి పరారీ, కేసు పూర్వాపరాలపై విస్తృతమైన చర్చ నడుస్తున్నది. ఈ చర్చలో కొందరు తమకు తోచిన విధంగా చట్టానికి భాష్యాలు చెప్తున్నారు. మరికొందరు అసత్యాలు, అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నారు. పోక్సో చట్టంపై అవగాహన లేకనో, ఉద్దేశపూర్వకంగానో చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇవి కూడా నేరాలే. ఈ నేపథ్యంలో అసలు బాలల పరిరక్షణలో పోక్సో చట్టం ప్రాధాన్యత ఏంటి, చట్టం ఏం చెప్తున్నది? తెలుసుకుందాం.
ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం ఉద్దేశం లైంగిక దాడుల నుంచి బాల బాలికలకు రక్షణ కల్పించడం. దేశంలో మహిళలపై, ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలు సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. మరికొందరు మైనర్లను మోసం చేయడం, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరక సంబంధాలు పెట్టుకోవడం, తర్వాత బెదిరింపులకు పాల్పడడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు భారతదేశం అత్యంత కఠినమైన చట్టాలలో ఒకటైన పోక్సోను అమలు చేస్తున్నది.
ఈ చట్టం పిల్లలపై జరిగే లైంగిక నేరాలను, ప్రత్యేకంగా నిర్వచించి, బాధితులకు రక్షణ కల్పించడమే కాకుండా, నిందితులకు కఠిన శిక్షలు విధించే విధంగా ఉంటుంది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) అమల్లోకి వచ్చిన తర్వాత కూడా నిబంధనలు స్పష్టతతో కొనసాగుతున్నాయి. భారత చట్టాల ప్రకారం 18 ఏండ్ల వయస్సు నిండని బాలబాలికలను మైనర్‌గా పరిగణిస్తారు. మైనర్లపై జరిగే లైంగిక దాడుల కేసులను పోలీసులు ఈ చట్టం ప్రకారం నమోదు చేస్తారు. పోక్సో చట్టం ప్రకారం మైనర్ సమ్మతితో లైంగిక సంబంధం కలిగి ఉన్నప్పటికీ అత్యాచారం కిందనే పరిగణిస్తారు. ఎందుకంటే శారీరక, మానసిక, సామాజిక భద్రతను అర్థం చేసుకునే స్థితిలో మైనర్లు ఉండరని చట్టం భావన.
2012లో భారత ప్రభుత్వం పోక్సో చట్టం తీసుకొచ్చింది. పిల్లల రక్షణ, వేగవంతమైన విచారణ, బాధితులకు మానసిక భరోసా, గోప్యత పరిరక్షణ, నిందితులకు కఠిన శిక్షలు ఈ చట్టం ప్రధాన లక్ష్యాలు. ఇది సాధారణ క్రిమినల్ చట్టాలకు భిన్నంగా, ప్రత్యేకంగా చిన్నారుల భద్రత కోసం రూపొందించిన చట్టం. పోక్సో చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం మైనర్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం. ఈ నేరానికి కనీసం పదేండ్లపాటు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు, జరిమానా ఉంటాయి. కేసు తీవ్రతను బట్టి కోర్టులు శిక్షను నిర్ణయిస్తాయి. పదేపదే దాడి చేయడం, బెదిరింపులు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం, మైనర్ గర్భం దాల్చడం, నమ్మకాన్ని దుర్వినియోగం చేయడం వంటి సందర్భాల్లో కేసు సెక్షన్ 5 కింద నమోదవుతుంది.
ఈ నేరానికి కనీసం 20 ఏండ్లపాటు జైలు, లేదా జీవిత ఖైదు, అత్యంత తీవ్రమైన సందర్భాల్లో మరణదండన వరకు శిక్ష పడుతుంది. పోక్సో చట్టం ప్రకారం అసభ్యకరమైన సందేశాలు పంపడం, న్యూడ్ ఫొటోలు పంపాలని అడగడం, ఫోన్, సోషల్ మీడియాలో వేధించడమూ నేరమే. ఇలాంటి నేరాలకు మూడేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటాయి.
పెండ్లి చేసుకుంటానని అబద్ధపు హామీ ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని కూడా చట్టం తీవ్రమైన అంశంగా పరిగణిస్తుంది. చాలా సందర్భాల్లో బాధితులు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు నిందితులు బెదిరింపులకు పాల్పడుతారు. వీటిని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. పోక్సో కేసులు సాధారణంగా నాన్ బెయిలబుల్. పోలీసులు కోర్టు వారంట్ లేకుండానే నిందితుడిని అరెస్ట్ చేయవచ్చు. చట్టపరమైన విచారణలో సాక్షాలు చాలా కీలకం.
వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సందేశాలు, కాల్ రికార్డింగ్స్, ఫొటోలు, వీడియోలు, ఒకవేళ బాధితురాలు గర్భం దాల్చితే మెడికల్ రిపోర్ట్స్, సాక్షుల స్టేట్మెంట్స్, హోటల్/ట్రావెల్ రికార్డ్స్, సీసీ కెమెరా దృశ్యాలు కేసులో ఆధారాలుగా ఉపయోగపడుతాయి. డిజిటల్ ఆధారాలు ఇప్పుడు కోర్టుల్లో చాలా కీలకంగా మారాయి. బాధితురాలి వాంగ్మూలం మేజిస్ట్రేట్ ముందు నమోదు చేస్తారు. కేసు తీవ్రతను బట్టి నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి. పోలీసులు విచారణ పూర్తి చేసి పూర్తి ఆధారాలతో చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పిస్తారు. ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతుంది.
చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం. ఎవరి కుటుం బం, రాజకీయ నేపథ్యం, ఆర్థిక స్థితి ఏదైనా సరే చిన్నారులపై నేరాల విషయంలో వేగవంతమైన, నిష్పక్షపాత విచారణ జరగాల్సిందే. అదే సమయంలో, ఆరోపణలు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా కోర్టులో తనను తాను రక్షించుకునే హక్కు కలిగి ఉంటారు. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి, బాధితురాలిని పెండ్లి చేసుకుంటానని చెప్పినా నేర తీవ్రత తగ్గదు. బాధితురాలు, నిందితుడి కులాలు ఒక్కటే కాబట్టి వారికి కులపెద్దలు పెండ్లి చేయాలనే ధోరణిలో ఇటీవల ఓ మంత్రి మాట్లాడటం నేరాన్ని ప్రోత్సహించడమే అవుతుంది. ఆ తర్వాత తన ఉద్దేశం వివరణ ఇచ్చారు.
సోషల్ మీడియా ఒకవైపు బాధితులకు వేదికగా మారుతున్నప్పటికీ, మరోవైపు విచారణపై ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉన్నది. తప్పుడు సమాచారం, రాజకీయ ప్రచారం వంటి అంశాలు నిజానిజాలను మసకబార్చవచ్చు. కాబట్టి బాధ్యతాయుత జర్నలిజం, బాధితుల గోప్యత, కోర్టు ప్రక్రియ పట్ల గౌరవం చాలా ముఖ్యం. ప్రేమ అనే భావన పవిత్రమైనది. కానీ అదే పేరుతో మోసం, దోపిడీ, బ్లాక్మెయిల్, లైంగిక హింస జరగడం అత్యంత ప్రమాదకరం. ప్రత్యేకంగా మైనర్ల విషయంలో మానసిక ఒత్తిడి, సోషల్ మీడియా ప్రభావం, భయం వారి జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే సమాజం మొత్తం కలిసి పిల్లల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలి. చిన్నారుల భద్రత కేవలం చట్టాల బాధ్యత మాత్రమే కాదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విద్యాసంస్థలు, మీడియా, ప్రభుత్వం, సమాజం అందరి బాధ్యత. అందరూ తమ బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తేనే పిల్లలకు భయంలేని భవిష్యత్తు నిర్మించగలం.
ధర్మో రక్షతి రక్షితః
– తన్నీరు శ్రీరంగారావు