Nagarjuna | టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఓ దుస్తుల వ్యాపారి తన చిత్రాలు, పేరుతో టీషర్టులను విక్రయిస్తున్నాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుపై నేడు విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు సదరు వ్యాపారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. “నాగార్జున పేరుతో టీషర్టులు మీరెలా అమ్ముతారు? ఆయన ఫొటోలను వాణిజ్యపరంగా వినియోగించే హక్కు మీకు ఎవరిచ్చారు?” అంటూ ధర్మాసనం ప్రశ్నలు సంధించింది.
వ్యాపారి తరఫున న్యాయవాది శృతి అయ్యర్ వాదనలు వినిపిస్తూ, ‘ది ఘోస్ట్’ సినిమా కోసం తాము అధికారిక మర్చండైజింగ్ భాగస్వాములమని కోర్టుకు తెలిపారు. ఓ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని, నాగార్జున స్వయంగా ఆ వస్తువులను ప్రమోట్ చేశారని వివరించారు. అందువల్ల తమపై నమోదైన కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే నాగార్జున తరఫు న్యాయవాది ఈ వాదనలను తీవ్రంగా ఖండించారు. ఒప్పంద పత్రాలు సమర్పించాలని కోరినా, పూర్తి వివరాలు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టుకు అందించిన ఈ-మెయిల్ కాపీలు కూడా అసంపూర్ణంగా ఉన్నాయని పేర్కొన్నారు.
చివరికి వ్యాపారి తరఫు న్యాయవాది, నాగార్జునతో గానీ, సంబంధిత నిర్మాణ సంస్థతో గానీ తమకు ఎటువంటి ప్రత్యక్ష ఒప్పందం లేదని అంగీకరించారు. దీంతో ధర్మాసనం మరింత సీరియస్ అయింది. ప్రత్యక్ష ఒప్పందం లేదని మీరే చెబుతున్నప్పుడు, ఈ టీషర్టులను విక్రయించే చట్టబద్ధ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? అంటూ ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.