ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 26 : విద్యార్థినులపట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచక వ్యాయామ ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ అధికారులు సస్పెన్షన్ వేటు వేయగా.. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా రూరల్ మండలం గుదిమళ్ల ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా ఎండీ షఫీక్ అహ్మద్ పదేండ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితులు హెచ్ఎం నందూలాల్‌కు విషయాన్ని వివరించి బాధపడ్డారు. దీంతో హెచ్ఎం పిల్లల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుని, మండల, జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
పీడీ కీచక చేష్టల గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు.. పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అనంతరం కీచక ఉపాధ్యాయుడిపై చర్య తీసుకోవాలని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారులు ఖమ్మం సఖి కేంద్రానికి బాధిత విద్యార్థినులను తీసుకెళ్లి వివరాలు సేకరించారు. ప్రాథమికంగా సేకరించిన వివరాల మేరకు షఫీక్ అహ్మద్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు జిల్లా బాలికల అభివృద్ధి అధికారి రూబీ, ఖమ్మం అర్బన్ ఎంఈవో శైలజ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఎంఈవో శ్రీనివాస్‌తో కలిసి నివేదికను డీఈవోకు అందజేశారు. ఈ మేరకు పీడీని సస్పెండ్ చేస్తూ డీఈవో సదానందం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.