సంచలన దర్శకుడు టి.కృష్ణ తెలుగు తెరపైన చిరస్మరణీయమైన అనేక చిత్రరాజాలు నిర్మించారు. ఆయన చిత్రాలన్నీ అభ్యుదయ ప్రభోదకాలు, ప్రజాచేతనా పతాకలుగా నిలిచాయి. తక్కువ కాలంలోనే ఏడు చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించిన టి.కృష్ణ చిత్రాలలో ‘ప్రతిఘటన’, ‘వందేమాతరం’, ‘దేశంలో దొంగలు పడ్డారు’, ‘దేవాలయం’, ‘అర్ధరాత్రి స్వతంత్రం’ ఇప్పటికీ ఎప్పటికీ నిత్యనూతనాలు. సమయాతీతంగా నేటి పరిస్థితులను కూడా ఈ చిత్రాలు ప్రతిబింబిస్తాయి. ఈ కోవకే చెందుతుంది ‘రేపటి పౌరులు’. ఈ చిత్రంలో ‘రేపటి పౌరులం… రేపటి పౌరులం’ అనే
టైటిల్ గీతాన్ని డా॥ సి.నారాయణ రెడ్డి రాశారు.
టి.కృష్ణ సినిమాలన్నీ ప్రజా సమస్యలను ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని వెలువడ్డవే. రాజశేఖర్, విజయశాంతి, పి.ఎల్.నారాయణ ప్రధాన తారగణంగా ‘ఈ తరం పిక్చర్స్’ నిర్మించిన ఈ చిత్రం 1986లో ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, తెలుగు ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది. సరస్వతి (విజయశాంతి), రవి (రాజశేఖర్)ల నిశ్చితార్థం జరుగుతుంది. రాజకీయాలు, నాయకుల ప్రభావంతో వీరి జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి. నాయకుల తప్పులను బయటపెట్టే క్రమంలో రవి మరణిస్తాడు. న్యాయం కోసం పోరాడుతున్న ఉపాధ్యాయిని సరస్వతి అత్యాచారానికి గురవుతుంది. ఆమె చేస్తున్న పోరాటంలో విద్యార్థులు భాగస్వామ్యంగా నిలుస్తారు. సామాజిక పోరాటాలు, ఉద్యమాల్లో రేపటి పౌరులైన యువత భాగస్వామ్యం అవ్వాలన్న అంశంతో నిర్మించిన ఈ చిత్రంలో వారిని ప్రతినిధులుగా చూపిస్తారు దర్శకుడు టి.కృష్ణ.
పల్లవి:
రేపటి పౌరులం రేపటి పౌరులం
రేపటి పౌరులం రేపటి పౌరులం
చరణం:
అధికారంతో ఐశ్వర్యంతో
అక్రమాలు తెగసాగించే
పెద్దలకే తగు బుద్ధులు చెప్పే
విప్లవవీరుల వారసులం!
‘రేపటి పౌరులం రేపటి పౌరులం/ రేపటి పౌరులం రేపటి పౌరులం’ అంటూ మొదలయ్యే ఈ చైతన్య గీతం యువత తమను తాము ఎలా తీర్చిదిద్దుకోనుందో, ఏ వారసత్వాన్ని తాము పుణికిపుచ్చుకుని దానిని రేపటి తరానికి అందించేందుకు పూనుకొందో తెలుపుతుంది. సామాజిక చేతన, అభ్యుదయ, ప్రగతిశీల, మానవతా వాదాలు సినారె కవిత్వానికి మూలధాతువులు, భూమికలు. తనదైన సమన్వయ దృక్పథంతో కవిత్వం చెప్పిన సినారె కవిత్వం ఈ నాలుగు పాదాల మీద నడిచిందనడంలో అతిశయోక్తి లేదు. తాను సినీ గీతాలను రాయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్ని యుగళగీతాలు, ప్రణయ, భక్తిగీతాలు రాసినా తనదైన ‘అభ్యుదయ శైలి’ని ఎక్కడా వదలేదు. ‘గులేబకావళి కథ’ చిత్రం నుంచి ‘వందేమాతరం’ వరకు, ఈ ‘రేపటి పౌరులు’ గీతం వరకు మనం దానిని చూడొచ్చు. అనేక గీతాల్లో, చిత్రాల్లో తనకు అవకాశం కలిగినప్పుడల్లా గాంధీ, నెహ్రూ, బోసుల అహింస, శాంతి, శౌర్యాలను ప్రశసించారు సినారె. ఈ గీతంలోని కింది పాదాల్లో దానిని చూడొచ్చు.
చరణం:
సత్యాగ్రహాల గాంధీలం
సమతా శాంతుల నెహ్రూలం!
సాహసంలో సుభాషులం!
సంకల్పంలో పటేలులం!
తెగించి దూకితే భగత్సింగులం తిరుగుబాటులో రామరాజులం!
నీతికి నిలిచిన నేతలం ఎత్తిన నిప్పుల పిడికిళ్లం!
అభ్యుదయాన్ని నిరంతరం ఒలికించే సినారె కలం పైన పేర్కొన్నట్టు ఇక్కడ శాంతి, సహనాలతో పాటు సంకల్పానికి మారుపేరైన ఉక్కు మనిషి పటేల్‌ను పిల్లలకు పరిచయం చేయడం బాగుంది. ఆయన మహా సంకల్పసిద్ధికి ప్రత్యక్ష నిదర్శనాల్లో రజాకార్ల నుంచి విముక్తం చెందిన మన హైదరాబాద్ రాజ్యం కూడా ఒకటి. విప్లవానికి చిరునామా అయిన భగత్‌సింగ్‌తో పాటు ఫిరంగీలను ఎదురించిన మన్యం వీరుడు అల్లూరిని, ఆయన బాటను కూడా పరిచయం చేస్తారు కవి. తెలుగు సినీగీతంలో ఈ తెలుగు వీరుడిని చెప్పడం ఔచిత్యం కదూ! కేవలం వీరత్వాన్ని, శూరత్వాన్ని చెప్పి కవి ఊరుకోలేదు. మన కళ్లముందే రోజూ జరుగుతున్న వాటిని కళ్లకు కట్టినట్టుగా ఈస్ట్‌మన్ కలర్లో చూపించడం తరువాతి చరణంలో మనం చూడవచ్చు,
చరణం:
న్యాయం చేసే నల్లకోటే
నందిని పందిని చేస్తుంటే
ప్రాణం పోసే తెల్లకోటే
ప్రాణాలను కాటేస్తుంటే
చట్టాలను కాపాడే లాఠి
పట్టపగలే బరితెగుతుంటే
ప్రజాసేవకై తొడిగిన టోపి
పాపాలను దాచేస్తుంటే
కప్పిన ముసుగులు చించేస్తాం
ఉప్పెనలా ముందడుగేస్తాం!
కేవలం వీరత్వాన్ని, శూరత్వాన్ని చెప్పి కవి ఊరుకోలేదు. యువతరం తాము ఎదుర్కొంటున్న వాటిని నిగ్గదీసి, నిలదీసి ఎలా అడగాలనుకుంటుందో చెబుతూ, నల్లకోటు న్యాయానికి బదులు అన్యాయాన్ని, ప్రాణం పోసే డాక్టరు దానికి పూర్తి విరుద్ధంగా నడుచుకుంటే, కాపాడాల్సిన రక్షకభటులు కబళించి వేస్తుంటే తాము సహించమని, ఎదిరించి నిర్మూలిస్తామని కవి రేపటి పౌరులతో అనిపిస్తారు, బోధిస్తారు. ఇంకా తెల్లటోపి మాటున పొంచి ఉన్న పాపాల పుట్టల గురించి చెబుతారు. చివరిగా రేపటి పౌరులైన మన యువత చేస్తున్న… చేయాల్సినవి చెబుతూ “చీకటి చీల్చుకు వెళుతున్నాం/ రేపటి ఎర్రటి వెలుగుల కోసం/ ఆగదు ఆగదు మా నడక/ అంతిమ గమ్యం చేరేదాకా!’ అని రాయడం యువతరం మీద సినారెకు ఉన్న నమ్మకానికి నిదర్శనం. నిజం కదూ!… ఇవ్వాళ మనం జెన్ జీని, వాళ్ల చేతనను చూడటం లేదా! సినారె కూడా అదే చెప్పారు.
– పత్తిపాక మోహన్