అడ్డగూడూరు, జూలై 14 : పోక్సో కేసు నిందితుడిని అరెస్టు చేయకుండా వదిలేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ బాలిక హైదరాబాద్‌లోని మలక్‌పేటలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటుంది. ఈ నెల 9న అడ్డగూడూరు మండలంలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. బాలెంల చైతన్య అనే యువకుడు బాలిక అమ్మమ్మ ఇంటి గోడ దూకి ఇంట్లోకి వచ్చాడు. బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా అమ్మమ్మ గుర్తించి వెంటనే సదరు వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాలిక అమ్మమ్మ ఆరోపించింది. తననే కేసు వాపసు తీసుకోవాలని ఒత్తిడి చేశారని పేర్కొంది.
పోక్సో కేసు నిందితుడిని వదిలేశామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపారు. బాలిక అమ్మమ్మ ఈ నెల 10న ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని రిమాండ్‌కు పంపడానికి కొంత ప్రొసీజర్ ఉంటుందని తెలిపారు.
ఈ నెల 13న భువనగిరిలోని భరోసా సెంటర్‌కు పిలిచి మహిళా ఎస్త్సె ద్వారా బాలిక స్టేట్మెంట్ రికార్డు చేసి ఆమె చిన్నమ్మ వాళ్ల ఇంటికి పంపించామని తెలిపారు. బాలిక అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు సీసీ టీవీలో రికార్డు అయినట్టు పోలీసులు చెప్పారు. చైతన్య తీసుకెళ్లినట్టు మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసు నమోదైనట్టు పేర్కొన్నారు. బాలిక, చైతన్య కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నట్టు తెలిపారు.