సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): మహిళలు, పిల్లల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు వివిధ సంస్థల సమన్వయంతో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ‘సహచరి’ అనే పేరుతో సరికొత్త కమ్యూనిటీ పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఇందులో చేరిన మహిళలు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా ఉంటారని సీపీ తెలిపారు. మంగళవారం మల్కాజిగిరి జోన్ మహిళల కోసం బోయిన్‌పల్లిలోని ఇంజీరియల్ గార్డెన్లో, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్ల ప్రతినిధుల కోసం నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుమతి మాట్లాడుతూ.. పోలీసులకు, సమాజానికి మధ్య బలమైన భాగస్వామ్యం ఉండాలన్నారు.
మెప్మా(ఎంఈపీఎంఏ), సెర్చ్(ఎస్ఈఆర్పీ) సంస్థల సమన్వయంతో ‘సహచరి’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ‘సహచరి’ కార్యక్రమం ద్వారా క్షేత్ర స్థాయిలో బలమైన నెట్వర్క్ ఏర్పడుతుందని.. దీనివల్ల నేరాలపై సకాలంలో సమాచారం అందుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళలు, బాలికల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. 3వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెప్మా అడిషనల్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ యాదగిరిరావు హాజరయ్యారు. డీసీపీలు శ్రీధర్, రాహుల్‌రెడ్డి, సురేశ్‌కుమార్, అనురాధ, ఉషారాణి పాల్గొన్నారు.