సోనామార్గ్: దేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన జెడ్-మోర్హ్ సొరంగ మార్గాన్ని ప్రధా ని మోదీ సోమవారం జాతికి అంకితం చేశారు. రూ. 2,700 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం సొరంగంలోనికి వెళ్లిన మోదీ ప్రాజెక్టు అధికారులతో ముచ్చటించారు. మధ్య కశ్మీర్‌లోని గండెర్బల్ జిల్లాలో గగన్‌గిర్, సోనామార్గ్ మధ్య 6.5 కిలోమీటర్ల పొడవైన ఈ రెండు వరుసల, రెండు దిశల సొరంగం అత్యవసర పరిస్థితులలో తప్పించుకోవడానికి 7.5 మీటర్ల సమాంతర మార్గం కూడా కలిగి ఉంది.
సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ సొరంగ మార్గం గగన్ఘిర్ నుంచి సోనామార్గ్ వరకు అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా నిర్మితమైంది. ఈ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడడం నిత్యకృత్యం వాటిని తప్పించుకునేందుకు ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. సోనామార్గ్‌కు ఏడాది పొడవునా రాకపోకలు సాగించడానికి అనుకూలత ఏర్పడిన కారణంగా పర్యాటకం కూడా పుంజుకునే అవకాశం ఉంది.