(స్పెషల్ టాస్క్ ఫోర్స్)
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘హలో.. ఎన్నికల బరి నుంచి తప్పుకో. ఇక నేనేమీ వినను’ అంటూ బీజేపీ రెబల్ నేతను బెదిరించారు ప్రధాని మోదీ. హిమాచల్‌ప్రదేశ్‌లో అధికార బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో స్వయంగా ప్రధాని మోదీయే రంగంలోకి దిగారు. కాంగడా జిల్లా ఫతేపూర్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న కృపాల్ పర్మార్.. బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో రెబల్‌గా బరిలో నిలిచారు. ఈ విషయం తెలిసిన ప్రధాని మోదీ పర్మార్‌కు ఫోన్ చేసి.. ‘హలో… చునావ్ సే హట్ జావో.. మై కుచ్ నహీ సునూంగా’ అని ఆదేశించారు. దాంతో పర్మార్.. సరేనంటూ తల ఊపుతూనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాపై ఫిర్యాదు చేశారు. ‘నడ్డా నన్ను 15 ఏండ్లుగా అవమానిస్తున్నారు’ అనడంతో, ప్రధాని మోదీ.. తాను చూసుకుంటానని చెప్తూనే ‘నీ జీవితంలో నా పాత్ర ఉందనుకొంటే పోటీ నుంచి తప్పుకో’ అని ఆజ్ఞ జారీ చేశారు. దీనికి పర్మార్ సమాధానమిస్తూ.. ‘మీ పాత్ర చాలా ఉన్నది.
నేను ఇది భగవంతుని ఆదేశంలా భావిస్తాను. మీరు రెండు రోజుల ముందు ఫోన్ చేసి ఉంటే బాగుండేది’ అని జవాబిచ్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పర్మార్‌తో సహా ఐదుగురిని మోదీ ఎన్నికల బరి నుంచి తప్పించారు. అయితే, ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థిని బెదిరించటం ఏమిటని, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదని రాజకీయ విమర్శకులు మోదీపై మండిపడుతున్నారు. ప్రధాని మోదీ ఫోన్‌కాల్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తున్నదని, స్వతంత్రులను ఎన్నికల బరి నుంచి తప్పించడానికి ప్రధాని మోదీ.. పీఎంవో కార్యాలయాన్ని ఉపయోగించుకుంటున్నారని ఫిర్యాదులో తెలిపింది.