PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రభుత్వాధినేతగా 8,391 రోజులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. అటు సీఎంగా, ఇటు ప్రధానిగా మోదీ ఈ ఘనత దక్కించుకున్నాడు. 24 ఏళ్లకు పైగా రాజ్యాంగ బద్ధమైన ప్రభుత్వాధినేతగా, అది కూడా మధ్యలో ఎలాంటి విరామం లేకుండా కొనసాగి మోదీ రికార్డు నెలకొల్పాడు. దీంతో ఇప్పటివరకు అత్యధిక (8,390) రోజులు పదవిలో కొనసాగిన సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ ఛామ్లింగ్ రికార్డును మోదీ అధిగమించారు.
ప్రధాని మోదీ తొలిసారిగా 2001లో గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2014లో ప్రధాని పదవి చేపట్టేవరకు ఆయన సీఎంగానే కొనసాగారు. ప్రధానిగా మోదీ ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. ఇదే సమయంలో గుజరాత్ రాష్ట్రానికి ఎక్కువ కాలం సీఎంగా పని చేసిన ఘనత కూడా ఆయన సొంతం. అలాగే, ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని పదవి చేపట్టి, ఎక్కువ కాలం కొనసాగింది కూడా మోదీయే. మోదీ ప్రధానిగా హ్యాట్రిక్ సాధించారు. 2014, 2019, 2024లో మోదీ తన పార్టీని, కూటమిని గెలిపించి అధికారం చేపట్టారు. ఇంతకుముందు మూడుసార్లు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన జవహర్ లాల్ నెహ్రూ రికార్డును సమం చేశారు.
వరుసగా దేశంలో అత్యధిక రోజులు పదవిలో కొనసాగిన రెండో ప్రధానిగా కూడా మోదీ నిలిచారు. ఈ విషయంలో ఇందిరాగాంధీ రికార్డును మోదీ దాటారు. అలాగే ఒక పార్టీ పక్ష నేతగా వరుసగా ఆరుసార్లు ఎన్నికైన ఘనత కూడా ఆయనదే. మోదీ అత్యధిక రోజులు దేశంలో ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు.