వేల్పూర్ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ( Budget ) లో బీసీ( BCs ) లకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ( BRS ) కు చెందిన బీసీ ఆనాయకులు మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నాయకులు రాజపూర్ణనందం, మొండి అశోక్,శివసారి నర్సయ్య తదితరులు మాట్లాడారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేసిందని విమర్శించారు. అధికారంలోకి రావడానికి బీసీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుందని ఆరోపించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఆ అంశాన్ని తేల్చకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ల విషయాన్ని గవర్నర్ ప్రసంగంలో గానీ, బడ్జెట్లో గానీ ప్రస్తావించక పోవడం బీసీల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు. ముదిరాజ్, గంగపుత్ర, గొల్ల కురుమ, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలి, విశ్వకర్మ, రజక వంటి కులాలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని అన్నారు.
బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధ హోదా ఇవ్వాలని ప్రకటించిన ప్రభుత్వం ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టిందని విమర్శించారు. ప్రతి జిల్లాలో బీసీ ఐక్యత భవనాలు, కొత్త డిగ్రీ కాలేజీలు, గురుకులాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీలు కూడా గాలిలో కలిశాయని ఆరోపించారు.
కామారెడ్డి డిక్లరేషన్‌కు పాతర వేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీ సమాజం తగిన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బట్టపూర్ ప్రవీణ్ యాదవ్, రేగుంట దేవేందర్,చౌట్పల్లి రవి,ఆర్మూర్ మహేష్, రాజా పూర్ణనందం,రేగుల్ల రాములు, దొంకంటి నర్సయ్య, కొత్తపల్లి అశోక్, ప్రవీణ్ యాదవ్ ,రామ్ రాజ్ గౌడ్, పాపాయి పవన్, మొండి అశోక్,కొల్లే నర్సయ్య,బింగి బాల చందర్
శ్రీనివాస్ పాలెం,పాలేపు అశోక్,రాజేశ్వర్ ,పర్స దేవన్న దొన్పాల్, మాణిక్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.