హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : కొత్త సినిమాల విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపును నిలిపివేస్తూ గతంలో సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ‘మన శంకర వర ప్రసాద్’, ‘రాజాసాబ్’ చిత్రాల నిర్మాతలు మంగళవారం హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అఖండ-2 సినిమా టికెట్ ధరల పెంపు నిలిపివేత పిటిషన్లపై తుది తీర్పు వచ్చే వరకు ఆదేశాలు జారీ చేయరాదని హైకోర్టును కోరారు.
టికెట్ల పెంపు వివాదంపై విచారణ పూర్తయ్యేవరకు టికెట్ల ధరల పెంపునకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని గత డిసెంబరు 9న సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని విజ్ఞప్తిచేశారు. ప్రత్యేక షోలకు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వాలని ‘మన శంకర వరప్రసాద్’ నిర్మాతలు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి, రాజాసాబ్ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ అప్పీళ్లను దాఖలు చేశారు.