Plastic vs Glass | ప్లాస్టిక్ పుట్టుకకు ముందు అందరి ఇండ్లలోనూ గాజుసీసాలు, లోహ పాత్రలే ఉండేవి. ప్లాస్టిక్ భూతం వచ్చేశాక.. గాజుసీసాల వాడకం తగ్గిపోయింది. అయితే పర్యావరణ పరిరక్షణకైనా, ఆరోగ్యానికైనా, కంటికి ఆనందాన్ని ఇచ్చేందుకైనా గాజు వస్తువులు ఎంతో మేలు.
♥ వంటగదిలో గాజుసీసాల ఉపయోగం ఎన్నో రకాలుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే ఏండ్ల తరబడి మన్నికగా ఉంటాయి. ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి, ప్యాకింగ్‌కు.. రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ పగిలిపోయినా పర్యావరణానికి వచ్చిన ముప్పేమీ లేదు. పునర్వినియోగం గాజు ప్రత్యేకత.
♥ పలుకులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర మసాలా దినుసులు, పాలు, పెరుగు, పచ్చళ్లు, కూరలు.. కావేవీ గాజుపాత్రలో నిల్వకు అనర్హం. ప్లాస్టిక్ గిన్నెలతో పోలిస్తే.. గాజు పాత్రల్లో నిల్వ ఉంచే పదార్థాలు పాడయ్యే ఆస్కారం తక్కువ.
♥ ప్లాస్టిక్ డబ్బాల్లో వేడి పదార్థాలు వేస్తే ఆహారం విషతుల్యం అయ్యే ప్రమాదం ఉంది. అదే గాజుపాత్రల్లో వేడిపదార్థాలను వేసినా.. ఏ సమస్యా ఉండదు. గంటలకొద్దీ గడిచినా ఆహారం తాజాగా ఉంటుంది.
♥ వంటగదికి బయట, లోపల గాజు వస్తువులు ఉంటే ఇంటికి అందం. అవి కంటికి ఇంపుగానూ కనిపిస్తాయి. పైగా గాజు పాత్రలు ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తాం. వస్తు వినియోగంలో క్రమశిక్షణ అలవడుతుంది. పాతబడిన గాజు పాత్రలకు రంగులు వేసి, పూలతో అలంకరించినా, మొక్కలుపెట్టినా చూడముచ్చటగా ఉంటాయి.