Toll Charges | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు రాష్ట్ర రహదారులన్నింటి నిర్వహణను ప్రైవేట్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. టోల్ వసూలును ఆదాయ వనరుగా చూపి రూ.30వేల కోట్లు రుణాలను సమీకరించేందుకు ప్రణాళికలు రచించినట్టు సమాచారం. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. క్యాబినెట్ సమావేశం వాస్తవానికి ఈ నెల 23న సమావేశం జరగాల్సి ఉండగా, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ సియోల్ పర్యటన నేపథ్యంలో శనివారానికి వాయిదా పడింది. ఈ సమావేశంలో కొత్త ఆర్వోఆర్ చట్టంపై చర్చించి ఆమోదించనున్నట్టు తెలుస్తున్నది. గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటుకు సైతం ఆమోదం తెలుపనున్నట్టు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
డ్యాం రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (డ్రిప్) పథకం కింద నీటిపారుదల శాఖ ప్రపంచ బ్యాంకు నుంచి రూ.645 కోట్లు రుణం తీసుకునేందుకు క్యాబినెట్ అనుమతించనున్నట్టు సమాచారం. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కింద రూ.7వేల కోట్ల రుణ సేకరణకూ అనుమతించనున్నట్టు చెప్తున్నారు. మిల్లర్ల నుంచి సీఎంఆర్ కోసం బ్యాంక్ గ్యారంటీపైనా చర్చించే అవకాశం ఉన్నది. ఉద్యోగులకు 2 డీఏలు ఇచ్చే అంశంపై చర్చిస్తారని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. అయితే వచ్చే ఏడాది మార్చి తర్వాతే ఆర్థిక పరమైన అంశాలపై చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో డీఏ మంజూరు కష్టమని చర్చించుకుంటున్నారు. హైడ్రా చట్టబద్ధత, మూసీ బాధితులకు పరిహారం వంటి అంశాలపై క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉన్నది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి మండలి కూలంకషంగా చర్చించనున్నట్టు తెలుస్తున్నది. ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతుండటంతో ఆదాయం ఎలా పెంచుకోవాలి? ఏయే విభాగాల్లో పన్నులు పెంచాలో మంత్రులు చర్చిస్తారని సమాచారం. మొదట ఎక్సైజ్ శాఖలో ధరలు పెంచే అవకాశం ఉన్నదని, ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. హైడ్రా, కొత్త రెవెన్యూ చట్టంపై ఆర్డినెన్స్ తీసుకొచ్చే బదులు వచ్చే నెలలో రెండుమూడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తే.. తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నది.