ప్రైమ్ లొకేషన్స్‌లలో స్థలాలు, బహుళ అంతస్తుల భవనాలను చూపిస్తాడు.. కొద్ది రోజుల్లోనే అక్కడి ప్లాట్ల రేట్లు 200 నుంచి 500 శాతం వరకు పెరుగుతాయని నమ్మిస్తాడు. ఈ మాటలు నమ్మేవారు లక్షలు, కోట్లలో అడ్వాన్సులు ఇచ్చే విధంగా మాయచేస్తాడు. నగదు చేతిలో పడ్డాక.. అదిగో..ఇదిగో అంటూ.. కాలం గడిపేస్తాడు. డబ్బులు ఇచ్చిన వారు ఒత్తిడి తెస్తే.. ‘తొందరెందుకు.. కొన్ని చిక్కులు ఉన్నాయి.. అవి పరిష్కారం కాగానే.. మీకు రిజిస్టర్ చేసేస్తాన’ని సముదాయిస్తాడు. అలా జాప్యం చేస్తూనే ఉంటాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించినా.. లీగల్‌గా చూసుకుంటానని.. అప్పుడు మీకే ఆలస్యమవుతుందని భయపెడతాడు. తెలుగు రాష్ర్టాల్లో పెద్ద మనిషిగా, సంపన్నుడిగా పేరొందిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు మోసాల తీరిది. మంది పైసలతో వందల కోట్ల ఆస్తులు పెంచుకున్న ఇతడి అక్రమాల పుట్ట ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
సిటీబ్యూరో, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): మోసా లు చేసి..సంపాదించిన డబ్బులతో శ్రీధర్‌రావు.. రియల్ భూమ్ ఉన్న ప్రాంతాల్లో స్థలాలను కొని పెట్టుకుంటాడు. బాధితులు ఎవరితోనైనా మధ్యవర్తితత్వం చేసుకుని వస్తే.. వారికి సంవత్సరాల కిందట తీసుకున్న నగదును మాత్రమే చెల్లిస్తానని చెబుతాడు. లేదంటే అవి కూడా రావంటాడు. కానీ ఆ సమయంలో స్థలం చూసిన ధరకు ఇప్పటి రేటుకు చాలా తేడా ఉండటంతో చాలా మంది వాటిని తీసుకునేందుకు సిద్ధంగా ఉండరు. కానీ.. శ్రీధర్‌రావు ఒక్క పైసా కూడా ఎక్కువగా ఇవ్వనని తేల్చి చెప్పి.. బాధితులను సతాయిస్తూనే ఉంటాడు. రాజకీయ ప్రముఖులు, పోలీసు శాఖలోని బడా ఆఫీసర్లను నజరానాలు, దావత్‌లతో మచ్చిక చేసుకొని వారిని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఇలా మాజీ సీఎంలు, ప్రముఖులను బుట్టలో వేసుకుని.. కొన్ని సందర్భాల్లో షాడోగా కూడా పని చేశాడని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.
బిజినెస్మెన్లే లక్ష్యం..
శ్రీధర్‌రావు ఎప్పుడు బిజినెస్మెన్లను టార్గెట్ చేస్తుంటాడు. పలు కార్పొరేట్, ఇతర వ్యాపార సంస్థలకు చెందిన వారి సమాచారాన్ని తన ఏజెంట్ల ద్వారా సేకరిస్తుంటాడు. వారి ఆస్తుల చిట్టా, క్రయ విక్రయాలపై దృష్టి పెడుతాడు. వారికి గాలం వేసి.. ప్రైమ్ ప్రదేశాలలో ఖరీదైన స్థలాలను ఎరవేస్తాడు.
రూ. 100 కోట్లు వచ్చాయని తెలుసుకుని..
నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వాహకుడు తన కంపెనీని అమ్మేస్తే.. రూ.100 కోట్లు వచ్చాయని శ్రీధర్‌రావు తన ఏజెంట్ల ద్వారా తెలుసుకున్నాడు. ఆ యజమానిని సంప్రదించి.. ‘మాదాపూర్‌లో రెండు ఎకరాల ఖరీదైన స్థలం విక్రయిస్తానని.. మీకు 500 శాతం లాభం ఖాయమని’ గారడీ చేశాడు. దీంతో ఆ యజమాని ఆ స్థలంలో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించి.. అద్దెకు ఇస్తే తనకు భారీ లాభాలు వస్తాయని ఆశపడి రూ. 60 కోట్లు శ్రీధర్‌రావు ఖాతాకు బదిలీ చేశాడు. అతడికి ఇప్పటివరకు స్థలం.. డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. కేవలం సైబరాబాద్ పరిధిలోనే ఎనిమిది కేసులు నమోదవ్వగా, గత మోసాల ఫిర్యాదులపై కూడా ఆరా తీస్తున్నారు. కాగా, శ్రీధర్‌రావుకు శుక్రవారం హైకోర్టు షరతులతో కూడన బెయిల్‌ను మంజూరు చేసింది.