ఆర్మూర్ : ఆర్మూర్ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ సంక్షేమ పాలన, ఆయన ప్రవేశపెట్టిన ప్రజాపథకాలే బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన బలమని అన్నారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దళిత బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, 24 గంటల ఉచిత విద్యుత్, కేసీఆర్ కిట్టు, అలాగే వృద్ధులకు 2000 రూపాయలు, దివ్యాంగులకు 4000 రూపాయల పెన్షన్ వంటి చారిత్రాత్మక పథకాలు ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకువచ్చాయని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాలు నేటికీ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశాయన్నారు. అదే నమ్మకంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కే ఓటు వేయనున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు అందరూ ఐక్యతతో పనిచేసి, కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఆర్మూర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో రాజ్యసభ ఎంపీ కే.ఆర్ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, షకీల్ అమీర్, మాజీ ఎమ్మెల్సీ వి.జి గౌడ్, ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరెంధర్, సీనియర్ నాయకులు పోల సుధాకర్, సంతోష్, సుజీత్ సింగ్ ఠాగూర్, సత్య ప్రకాష్, చిన్నారెడ్డి, గంగాధర్, మోయిన్, ఇమ్రాన్, మాలిక్ బాబా, అంజద్, రహామన్, షాకీర్ తదితర ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.