Pinipe Srikanth : వైసీపీ సీనియర్ నాయకుడు, ఏపీ మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు పినిపె శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన వాలంటీర్ హత్య కేసులో శ్రీకాంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన కోసం గాలిస్తున్న పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. తమిళనాడులోని మధురైలో శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అక్కడే అతడిని కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై ఏపీకి తీసుకురానున్నారు.
వాలంటీర్ హత్య కేసులో ఏకంగా మాజీ మంత్రి కుమారుడు అరెస్టు కావడం కలకలం రేపుతోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లిలో రెండేళ్ల క్రితం వాలంటీర్ హత్య జరిగింది. కోనసీమ అల్లర్ల సమయంలో వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు 2022 జూన్ 6న దుర్గా ప్రసాద్‌ను హత్య చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అప్పట్లోనే ఉప్పలగుప్తం మండలానికి చెందిన వడ్డి ధర్మేశ్‌ను నిందితుడిగా చేర్చారు. అతడు దుర్గాప్రసాద్‌కు సన్నిహితుడే కాకుండా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్‌గా కూడా ఉన్నట్టు తెలిసింది.
ధర్మేశ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పినిపె శ్రీకాంత్‌తోపాటు మరో నలుగురి పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు. అయితే ధర్మేశ్ అరెస్టు తర్వాత శ్రీకాంత్ సహా నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు గత రాత్రి మధురైలో శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.