తిరువనంతపురం, ఫిబ్రవరి 10: బీజేపీ ఓటేయకపోతే కేరళ, బెంగాల్, కశ్మీర్లాగా ఉత్తరప్రదేశ్ మారుతుందన్న యోగి వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరాయి విజయన్ స్పందించారు. యూపీ ప్రజలు కూడా అదే కోరుకొంటున్నారని, కేరళ తరహా పాలన తమకు కూడా కావాలనుకొంటున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్ కూడా కేరళలాగా అభివృద్ధి చెందితే అక్కడి ప్రజలకు శాంతియుత వాతావరణం, మెరుగైన జీవన ప్రమాణాలు లభిస్తాయని పేర్కొన్నారు.
‘ఉత్తరప్రదేశ్ కేరళలాగా మారితే ప్రజలకు మంచి విద్య, ఆరోగ్యం లభిస్తుంది. సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు అందుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. కులం, మతం పేరుతో ప్రజలు చంపుకొనే పరిస్థితి ఉండదు. అందుకే యూపీ ప్రజలు కూడా తమ రాష్ట్రం కేరళలాగా మారాలని కోరుకొంటున్నారు’ అని విజయన్ ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని హిందీలో ట్వీట్ చేస్తూ యోగిని ట్యాగ్ చేశారు.
ఓడిపోతామని యోగికి అర్థమయ్యింది
యోగి వ్యాఖ్యలపై బెంగాల్, కశ్మీర్ నేతలు కూడా స్పందించారు. పశ్చిమ బెంగాల్ గురించి యోగికి ఏమీ తెలియదని టీఎంసీ రాజ్యసభ ఎంపీ శంతను సేన్ అన్నారు. యూపీలో తమ పార్టీ ఓడిపోతుందని యోగికి అర్థం అయిందని, అందుకే ఇలా మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. అయితే, కేరళ, బెంగాల్ రాష్ర్టాల పేర్లను ప్రస్తావించడంతో ఆ ప్రయత్నం విఫలం అవుతుందని పేర్కొన్నారు. యూపీ కంటే బెంగాల్ అభివృద్ధి చెందిందని, కులం పేరుతో దాడులు లేవని ఆరోపించారు. యూపీతో పోలిస్తే కశ్మీర్లో క్రైమ్ రేటు తక్కువగా ఉన్నదని, జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఎద్దేవా చేశారు.
దొంగ స్థానంలో మరో దొంగ
ప్రధాని మోదీకి గానీ, కేంద్ర దర్యాప్తు సంస్థలకు గానీ భయపడే ప్రసక్తే లేదు. ఆయన అహంకారం చూస్తుంటే నవ్వొస్తుంది. ఉత్తరాఖండ్లో బీజేపీ మార్చిన ముఖ్యమంత్రులందరూ అవినీతిపరులే. ఒక దొంగ స్థానంలో మరో దొంగను సీఎం పీఠంపై కూర్చొబెట్టారు. నేను ఆయన మాట విననని మోదీ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నిజమే. ఎందుకంటే నేను మోదీకి గానీ, ఆయన సీబీఐ, ఈడీలకు భయపడను.
-గురువారం ఉత్తరాఖండ్ ఎన్నికల ,ర్యాలీలో రాహుల్ గాంధీ
యూపీలో యువతకు ఉపాధి ఏది?
కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనాలోచిత నిర్ణయాల కారణంగా వాణిజ్యం, వ్యాపారాలు నాశనమయ్యాయి. యువతకు ఉపాధి కల్పించడంపై యోగి సర్కార్ ఏమాత్రం దృష్టి సారించలేదు. ప్రజల సమస్యలు తప్ప మిగతా అంశాల గురించి మాట్లాడుతారు. యూపీలో అధికారంలో ఉన్న ఐదేండ్ల కాలంలో ఉద్యోగ ఖాళీలను ఎందుకు ప్రకటించలేదు? ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించలేదు?
-గురువారం యూపీ ఎన్నికల ,ర్యాలీలో ప్రియాంక గాంధీ