చిక్కడపల్లి, నవంబర్ 7: ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాదిగలను మోసం చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు. ఆదివారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో మాదిగ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రవి మాట్లాడారు. కిషన్రెడ్డి హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంపై ఒత్తిడి తేకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ వేయిస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. కేంద్రం మాల, మాదిగల జనాభా లెక్కలతో పాటు బీసీ జనగణన చేపట్టాలన్నారు. రిజర్వేషన్లను 20 శాతం పెంచి.. 12 శాతం మాదిగలకు కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లెల వీరస్వామి, ప్రొఫెసర్ ముత్తయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ చీమ శ్రీనివాస్, కోశాధికారి రాంబాబు పాల్గొన్నారు.