నల్లగొండ, సెప్టెంబర్ 22 : పెట్రోల్ బంక్ డీలర్లు బాధ్యతతో మెలగాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు. సోమవారం నల్లగొండలోని పెట్రోల్ బంక్‌లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీలర్లు కొందరు బంక్ నిర్వహణను తేలిగ్గా తీసుకుంటున్నారన్నారు. బంక్ లపై డీలర్ల పర్యవేక్షణ కొరవడితే.. చిన్న, చిన్న విషయాలకు కూడా సమాధానం చెప్పే బాధ్యులు బంక్‌లో ఎవరూ ఉండరన్నారు. డీలర్లు ఎక్కడో ఉండి.. బంక్ ఏదోఒకలా నడుస్తుంది అనుకుంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని ఆయన హెచ్చరించారు. చమురు సంస్థల అధికారులతో రఘునందన్ నేరుగా ఫోన్లో మాట్లాడి పలు బంకుల్లో నెలకొన్న సమస్యలను వివరించారు. కొన్ని బంకుల్లో మేనేజర్లు మాత్రమే ఉన్నారని, డీలర్లు ఎక్కడో ఉండటం, బంక్ నిర్వహణను ఎవరికో అప్పగించడం వల్ల డీలర్ కాని వ్యక్తులకు వినియోగదారుల పట్ల మర్యాదగా వ్యవహరించగలిగే బాధ్యత అంతగా ఉండదన్నారు.