రాజాపేట, సెప్టెంబర్ 22 : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేసియా నిధులు విడుదల చేసి బాధిత గీత కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలగోని జయరాములు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రాజాపేట పట్టణంలోని ఎన్ కే ఫంక్షన్ హాల్లో కేజీకేఎస్ సంఘం మండలాధ్యక్షుడు పాండవుల లక్ష్మణ్ గౌడ్ అధ్యక్షతన కల్లుగీత కార్మిక సంఘం మండల ఆరవ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైన్ షాపుల్లో గీత కార్మికులకు 25 శాతం వాటా కేటాయించాలన్నారు. గీత కార్మికులు నిత్యం ప్రమాదాలు అంచున తమ జీవనం కొనసాగిస్తున్నప్పటికీ, గీత కార్మికుల సంక్షేమానికి గాని, గీత వృత్తిని ఆధునీకరించడానికి గానీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం ప్రమాదవశాత్తు తాటి చెట్లపై నుండి క్రింద పడి మృతి చెందిన, గాయపడిన కుటుంబాలకు రావాల్సిన ఎక్స్‌గ్రేషియా ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల బాధిత కుటుంబాలు దుర్భర పరిస్థితిలో ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు విడుదల చేసి బాదిత కుటుంబాలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా అధ్యక్షుడు రాగీర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. వృత్తిలో ప్రమాదాలు నివారించడానికి ఇస్తామన్న కాటమయ్య రక్షణ కిట్లు జిల్లాలో 600 మందికి మాత్రమే ఇచ్చారని, తక్షణమే గీత కార్మికులందరికీ అందించాలన్నారు. కల్లుగీత కార్మికులకు ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ రూ.4 వేలకు పెంచాలన్నారు. అలాగే ప్రతి గీత కార్మికుడికి మోటార్ సైకిల్ ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు నేమిలె మహేందర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు దూపటి వెంకటేష్, మండల గౌరవ అధ్యక్షుడు గోపగాని యాదగిరి గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి బత్తిని సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిల్వర్ బాల్‌రాజ్ గౌడ్, బత్తిని బలరాం, వెంకటయ్య, పాండవుల ప్రభాకర్, నరసింహులు, ఆంజనేయులు, దొంకెన పాండు, గుండగోని శ్రీనివాస్, గుడిసెల వెంకటయ్య, గొల్లపల్లి స్వామి, రంగ నరేష్, నీల నాగేష, నమిల పురుషోత్తం పాల్గొన్నారు.