
సిరిసిల్ల రూరల్, నవంబర్ 22: సీఐ తప్పుడు కేసు పెట్టడంతో కలత చెందానని పేర్కొంటూ ఓ యువకుడు ఫేస్బుక్ లైవ్‌లో ఆత్మహత్యకు యత్నించడం రాజన్న సిరిసిల్లలో కలకలం రేపింది. తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌కు చెందిన గొడిశెల దిలీప్, వేములవాడ మండలం చింతలఠాణా (ఆర్అండ్ఆర్) కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ యువతి తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించలేదు. యువకుడిపై సిరిసిల్ల ఠాణాలో ఫిర్యాదుచేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దిలీప్ సోమవారం బస్వాపూర్ శివారులోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఫేస్బుక్లైక్లో మాట్లాడుతూ.. కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకొని తాగాడు. తనను యువతి బంధువులు కులం పేరుతో దూషించారని, పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఆరోపించా డు. సిరిసిల్ల పట్టణ సీఐ అనిల్‌కుమార్ ఈ కేసును అడ్డంపెట్టుకొని తనను ఇబ్బందిపెడుతున్నారని వాపోయాడు. అందుకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు చెప్పారు. విషయం తెలుసుకున్న దిలీ ప్ కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని సిరిసిల్ల దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.