వాజేడు, జూలై 29 : ములుగు జిల్లా(Mulugu) వాజేడు మండలంలో కురుస్తున్న భారీ వర్షానికి చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగర బొగత జలపాతం(Bogatha water falls) ఉప్పొంగింది. జలపాతం ముందు ఉన్న సెల్ఫీ వ్యూ పాయింట్‌పై నుంచి స్విమ్మింగ్ పూల్ మీదుగా ఉధృతంగా ప్రవహించింది. దీంతో బొగత సందర్శనకు అటవీశాఖ అధికారులు మధ్యాహ్నం నుంచి అనుమతి నిలిపివేశారు.
తాము టికెట్ తీసుకొని లోపలకు వెళ్లగా అనుమతి లేదని బయటకు పంపించారని, టికెట్ డబ్బులు ఇవ్వాలని అడిగినా అధికారుల నుంచి సమాధానం కరువైందని కొందరు పర్యాటకులు ఆరోపించారు. ఈ విషయంపై ఇన్చార్జి రేంజ్ అధికారి నరేందర్‌ను అడగగా అలాంటిదేమీ లేదని, జలపాతం వీక్షించిన తర్వాతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బయటకు పంపించామని తెలిపారు.