హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు ఏప్రిల్ 1 నుంచి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. కొవిడ్ నేపథ్యంలో 2020 మార్చి నుంచి భక్తులకు అనుమతి రద్దుచేసి ఏకాంతంగా ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్ ఉధృతి తగ్గడంతో రెండేండ్ల తర్వాత తిరిగి భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. భక్తులు tirupathibalajii.ap.gov.in వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు. టికెట్లు పొందిన వారు రెండు రోజుల్లో టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన భక్తులు నేరుగా బుక్ చేసుకోవచ్చు. పర్వదినాలలో ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ లేదా రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. పాల్గుణ పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 18న గరుడసేవ జరగనున్నది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి గరుడునిపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.