e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News మూగజీవాలకు ప్రేమతో..

మూగజీవాలకు ప్రేమతో..

  • వైద్యం అందిస్తారు.. శస్త్ర చికిత్స చేస్తారు
  • నగరంలో పీపుల్‌ ఫర్‌ యానిమల్‌ ఎన్జీవో సేవ
  • జీహెచ్‌ఎంసీతో కలిసి పలు కార్యక్రమాలు

ఇలా ఒకటేమిటీ.. నిత్యం ఎన్నో ఫోన్‌కాల్స్‌.. ప్రతి ఫోన్‌ కాల్‌కు తక్షణం స్పందిస్తున్నారు పీపుల్‌ ఫర్‌ యానిమల్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. మూగజీవాలపై వారికున్న ప్రేమతో క్షణాల్లో ఘటనాస్థలికి చేరుకుంటున్నారు. మూగజీవాలను ఆదుకునేందుకు అక్కడికక్కడే వైద్యం అందిస్తున్నారు. అవసరమైతే శస్త్రచికిత్స కోసం తరలిస్తున్నారు. మానవత్వాన్ని చాటుతున్నారు. నగరంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో కలిసి మూగజీవాల పరిరక్షణకు పాటుపడుతున్నారు.

హలో సర్‌.. నాగోల్‌ సర్కిల్‌కు సమీపంలో ఓ కారు కుక్కను ఢీకొట్టింది. కుక్కకు బాగా దెబ్బలు తగిలి రక్తం కారిపోతుంది. వచ్చి కాపాడండి..
ఓ వాహనదారుడి ఫోన్‌.
హలో.. ఉప్పల్‌ చౌరస్తాకు సమీపంలోని కాలనీలో రెండు కుక్కలు ఓ గుంతలో పడి తీవ్రగాయాలై తల్లడిల్లుతున్నాయి. ఎవరూ పట్టించుకోవడంలేదు. వచ్చి రక్షించండి..
ఓ స్థానికుడి ఫోన్‌.
సార్‌.. బండ్లగూడలోని మా కాలనీలోని ఓ ఇంట్లో కుక్క పిల్లను బంధించి బాగా హింసిస్తున్నారు. వాటిని కాపాడండి…
ఇంటి పక్కనుండే వ్యక్తి ఫోన్‌.

- Advertisement -

నగరంలో వీధి కుక్కలు, పిల్లులు, కోతులు, ఇతర మూగజీవాల సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు పీపుల్‌ ఫర్‌ యానిమల్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. కాప్రా, ఉప్పల్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీతో కలిసి పనిచేస్తూ యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ (ఏబీసీ) కోసం పాటుపడుతున్నారు. ప్రత్యేకంగా హెల్ప్‌ లైన్‌ నడుపుతున్నారు. మూగజీవాలకు ప్రమాదం జరిగిందని ఎక్కడ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. అక్కడకు చేరుకుని సపర్యలు చేస్తున్నారు. కొందరు తమ పెంపుడు జంతువులు అనారోగ్యం బారిన పడితే తమకు ఫోన్‌ చేసి ఇచ్చేస్తారని, వాటిని తిరిగి తీసుకెళ్లరని నిర్వాహకులు చెప్తున్నారు. వాటికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.

పీపుల్‌ ఫర్‌ యానిమల్‌ హైదరాబాద్‌ సంస్థ 20 ఏండ్లుగా ఓల్డ్‌సిటీలోని పురానాపూల్‌ కేంద్రంగా పనిచేస్తున్నది. ఏడాది కిందట జీహెచ్‌ఎంసీ పరిధిలోని నాగోల్‌ ఫత్తులగూడ ప్రాంతంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడే హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు ఫోన్‌లకు స్పందించేలా రెస్క్యూ కో ఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకునేలా 4 వాహనాలు సిద్ధం చేశారు. అవి నగరం నలుమూలాల ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ప్రతి వాహనంలో జంతువులకు వైద్యం అందించేలా ఓ నర్సు ఉంటారు. అక్కడ మూగజీవానికి జరిగిన ప్రమాద తీవ్రతను బట్టి వైద్యం అందిస్తారు. ప్రమాదం చిన్నదయితే అక్కడే వైద్యం చేస్తారు. గాయం పెద్దది అయితే కార్యాలయానికి తీసుకొస్తారు. ఇక్కడ ఐదుగురు వైద్యులు నిత్యం సేవలందిస్తుంటారు. కాలు విరిగినా, వెన్నెముక దెబ్బతిన్నా, కన్నుపోయినా అవసరమైతే సర్జరీ చేస్తారు. రెండ్రోజుల నుంచి 60 రోజుల వరకు అక్కడే ఉంచి పర్యవేక్షిస్తారు. కోలుకున్నాక మళ్లీ పట్టుకొచ్చిన ప్రాంతంలోనే విడిచిపెడతారు.

కంటికి రెప్పలా చూసుకుంటాం
రోజూ దాదాపు 60-80 వరకు ఫోన్‌ కాల్స్‌ వస్తుంటాయని రెస్క్యూ కోఆర్డినేటర్‌ జావెద్‌ తెలిపారు. శస్త్ర చికిత్స కోసం వచ్చే కుక్కలు, కోతులు, పిల్లులు, ఇతర మూగజీవాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటామని వైద్యులు చెప్తున్నారు. ఆహారం తీసుకోలేని వాటికి గ్లూకోజ్‌లు ఎక్కిస్తామని చెప్పారు. రోజుకు కనీసం 30 వరకు కాళ్లు విరిగిన, తీవ్ర గాయాలైన కేసులు వస్తుంటాయని చెప్తున్నారు. కొన్ని పెంపుడు కుక్కలు, వీధి కుక్కల్లో మంచివాటిని దత్తత తీసుకొనేలా అడాప్షన్‌ డ్రైవ్‌ను కూడా చేపడుతామని నిర్వాహకులు తెలిపారు. స్వచ్ఛంద సంస్థకు వచ్చే విరాళాలతోపాటు దాతల సహకారంతో దీన్ని నడుపుతున్నట్టు పేర్కొంటున్నారు. తాము జంతు హింసకు వ్యతిరేకమని.. అందుకే రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌లోని కబేళాలకు తీసుకొచ్చే ఒంటెలను పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

మూగజీవాలను హింసించడం నేరం
ఎక్కడ మూగజీవాలు హింసకు గురయినట్టు సమాచారం వచ్చినా వెంటనే మా బృందం అక్కడికి వెళ్తుంది. వారికి అర్థమయ్యేలా చైతన్యపరుస్తుంది. అప్పటికీ వినకపోతే హెచ్చరిస్తుంది. అయినప్పటికీ ససేమిరా అంటే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తుంది. వారికి శిక్ష పడేలా చూస్తాం. ఇటీవల అమీన్‌పూర్‌లో కుక్కలను హింసించిన వారిపై ఫిర్యాదు కూడా చేశాం. మూగజీవాలకు పిల్లలు పుట్టిన తర్వాత కనీసం 60 రోజులైనా అవి తల్లిదగ్గర ఉండాలి. అప్పుడే వాటికి ఇమ్యూనిటీ పవర్‌ ఎక్కువగా ఉంటుంది. కానీ, కొంతమంది చట్ట వ్యతిరేకంగా పుట్టిన కొన్ని రోజులకే వాటిని అమ్మేస్తున్నారు. ఇది కూడా నేరమే.

  • మంజీరా సేన్‌, జాయింట్‌ సెక్రటరీ, పీపుల్‌ ఫర్‌ యానిమల్‌ సంస్థ, హైదరాబాద్‌
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement