నల్గొండ రూరల్, అక్టోబర్ 03 : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ మాదిగ సైన్యం (టీఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కత్తుల రవన్న మాదిగ డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు విడుదల కాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నల్లగొండలోని తెలంగాణ మాదిగ సైన్యం జిల్లా కార్యాలయంలో శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ మాదిగ సైన్యం సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థుల కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల కోసం అద్దె హాస్టల్ భవనాలపై ఆధారపడకుండా సొంత భవనాలను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీఎంఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొడతాల నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి నక్కల సైదులు, జిల్లా అధ్యక్షుడు నరసింహ, టీఎంఎస్ నాయకులు పెదమం శివ, గిరి, చందు, మోహన్ పాల్గొన్నారు.