హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానలకు సరఫరా చేసిన సర్జికల్, డయాగ్నోస్టిక్స్కు సంబంధించిన రూ.168కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం అసోసియేషన్ ప్రతినిధులు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం అందజేశారు.
రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివద్ధి సంస్థ ఎండీ అభ్యర్థన మేరకు మందులు, సర్జికల్స్కు ఆర్థికశాఖ ప్రతి నెలా రూ.100 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినా.. మే నెలకు రూ.50 కోట్లు మాత్రమే విడుదల చేసినట్టు తెలిపారు. టీజీఎంఎస్ఐడీసీ పరిధిలో రూ.128కోట్లు, గాంధీ రూ.7కోట్లు, నిలోఫర్ రూ.7కోట్లు, ఉస్మానియా రూ.4.5 కోటు, పేట్లబుర్జు రూ.1.5కోట్లు, ఈఎన్టీ రూ.1.5కోట్లు సరోజినీ దేవి రూ.1.25 కోట్లతోపాటు ఆరోగ్యశ్రీ కింద మరో రూ.18 కోట్లు బకాయిలు ఉన్నట్టు వివరించారు.