Pelican signals | సిటీలో సులువుగా పాదచారులు రోడ్డు దాటేందుకు పెలికాన్ సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చాయి. రోడ్డు దాటేందుకు పాదచారుల కోసం అందుబాటులోకి తెచ్చిన సౌకర్యాలను ఉపయోగించుకొని, ప్రమాదాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ట్యాంక్‌బండ్‌పై సిగ్నల్స్ ప్రారంభించారు. దీంతో నగర వ్యాప్తంగా 30 పెలికాన్ సిగ్నల్స్ అందుబాటులోకి రాగా.. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో 47 అందుబాటులోకి రానున్నాయి. ఇందులో సైబరాబాద్‌లో ఇప్పటికే కొన్ని అందుబాటులోకి వచ్చాయి. సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ. 8.5 కోట్లతో ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 77 చోట్ల ఈ సిగ్నల్స్ ఏర్పాటవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల మరణాలలో పాదచారులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 52 మంది పాదచారులు మరణించారు. హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన పెలికాన్ సిగ్నల్స్‌ను వాడేందుకు వాలంటీర్ల సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ వాలంటీర్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 , సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు సిగ్నల్స్ వద్ద విధుల్లో ఉంటారు. 50 మంది వరకు వాలంటీర్లు ఇప్పుడు పనిచేస్తున్నారు.
పాదచారుల కోసం నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫుట్ఓవర్ బ్రిడ్జిలను పాదచారులు ఎక్కువ సంఖ్యలో ఉపయోగించడం లేదు. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండటంతో అటూ వాహనదారులు, ఇటు పాదచారులు ఇద్దరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పాదచారులకు అనువైన వాతావారణం ఏర్పాటు చేసేందుకు పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. కనీసం మూడు నిమిషాల వ్యవధిలో 15 సెకండ్ల పాటు పెలికాన్ సిగ్నల్స్‌ను ఉపయోగిస్తారు. ఈ 15 సెకండ్లలో పాదచారులు రోడ్డు దాటాల్సి ఉంటుంది. రద్దీగా ఉండే ప్రాంతాలైన ట్యాంక్‌బండ్, మెహిదీపట్నం, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, పంజాగుట్ట, అబిడ్స్, ట్యాంక్‌బండ్, హిమాయత్‌నగర్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో ఈ సిగ్నల్స్ ఏర్పాటయ్యాయి. ట్యాంక్‌బండ్‌పై రెండు చోట్ల ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు.
పెలికాన్ సిగ్నల్‌ను ఆపరేట్ చేసేందుకు వాలంటీర్లను నియమించడంతో పాటు వారికి ఎలా ఉపయోగించాలనే దానిపై శిక్షణ కూడా ఇచ్చారు. ఈ శిక్షణ తీసుకున్న వాలంటీర్లు సిగ్నల్స్‌ను ఆపరేటింగ్ చేస్తుంటారు. ఒక్కో సిగ్నల్ వద్ద కనీసం 10 మంది పాదచారులు చేరగానే సిగ్నల్‌ను ఆన్ చేస్తారు. ఒకసారి ఈ సిగ్నల్ వేసిన తరువాత కనీసం మూడు నిమిషాల వరకు ఆపాల్సి ఉంటుంది. సిగ్నల్ ఆపరేటింగ్ కోసం ట్రాఫిక్ సిబ్బందిని ఉపయోగించడం వల్ల సిబ్బంది కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో వాలంటర్లీ సేవలను వినియోగిస్తున్నారు.