అగ్ర హీరో పవన్‌కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘వినోదాయ సీతమ్’ తెలుగు రీమేక్‌లో తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకున్నారు. సాయిధరమ్‌తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ అతిథి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా వుండగా సుజిత్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్- వర్కింగ్ టైటిల్) చిత్రం ఈ నెల 15నుంచి సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిసింది. దాదాపు రెండు నెలల పాటు భారీ షెడ్యూల్స్కు సన్నాహాలు చేశారని చెబుతున్నారు. ఇందులో చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలకమైన ఘట్టాల్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించబోతున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం కూడా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది.