హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ ప్రజలకు తెలంగాణ అనే బలమైన భావన ఉన్నది. అటు తమిళనాడు వాళ్లకు తమిళ భావన ఉన్నది. కానీ దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్ వాళ్లకే ఆంధ్రా భావన అనేదే లేదు. అకడ ఎప్పుడూ కులాల పంచాయితీలు తప్ప ప్రాంతీయ అస్తిత్వం, బలం కనిపించవు’ అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ అంశంపై కేటీఆర్ తప్పుగా ఏమీ మాట్లాడి ఉండరు. తెలంగాణ ముమ్మాటికీ ఇకడి భూమిపుత్రుల జాగీరే.. కాదని ఎవరన్నారు? ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు’ అని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జనసేన పార్టీ ప్రతిపాదించిన ‘తెలంగాణ నవనిర్మాణ సభ’కు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో మంగళవారంనాడు పవన్‌కల్యాణ్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఆయన వ్యాఖ్యలపై రాజకీయాలకు అతీతంగా తెలంగాణ భగ్గుమన్నది. ప్రజలనుంచి, ఉద్యమకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో పవన్‌కల్యాణ్ తోకముడిచారు. తెలంగాణ ఎవరి జాగీర్? అని ప్రశ్నించిన ఆయనకు గంటల వ్యవధిలోనే జ్ఞానోదయం కలిగినట్టుంది. బుధవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజమే! తెలంగాణ భూమిపుత్రుల జాగీరే’ అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో తనకు మంచి సోదరభావం ఉన్నదని తెలిపారు. తెలంగాణలో రాజకీయం చేయాలనిగానీ, అకడ పోటీ చేయాలనే ఉద్దేశంగానీ తనకు లేవని వెల్లడించారు. ఇకడి జనసేన కార్యకర్తలే తెలంగాణలోనూ పోటీ చేద్దామని తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. ఈ క్రమంలో జరిగిన చిన్న ఘటన అనవసరంగా పెద్దగా మారిందని, పోలీసులు ముందే సభకు అనుమతి ఇచ్చి ఉంటే ఇది జరిగేది కాదన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 12 ఏండ్ల్లు గడుస్తున్నా.. ఆ రాష్ట్ర ప్రజల్లో తెలంగాణ అనే భావోద్వేగం, సెంటిమెంట్ ఏమాత్రం తగ్గలేదని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఏపీ వాళ్లకే ఎలాంటి ఆంధ్రా భావన అనేది లేదని, ఇక్కడ ఎప్పుడూ కులాల పంచాయితీలు తప్ప ప్రాంతీయ అస్తిత్వం, బలం కనిపించబోవని పేర్కొన్నారు. సభలకు అనుమతులు నిరాకరిస్తూ గొంతు నొకే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. ఈ అప్రజాస్వామిక ధోరణిపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను జనసేన కార్యకర్తలు పలువురు బెదిరింపులకు దిగారు. దమ్ముంటే ఫోన్ లిఫ్టు చెయ్.. అంటూ తీవ్ర దుర్భాషలాడుతూ జనసేన నాయకుడు చందు తదితరులు హెచ్చరికలు జారీచేశారు. సోషల్ మీడియా వేదికగా కూడా జనసేన కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడ్డారు. అదే విధంగా సీఎం రేవంత్‌రెడ్డిపైనా చందు మరికొందరు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీచేశారు. బలిస్తామంటూ చందు మరికొందరు హెచ్చరిస్తున్న వీడియో ఎస్ఎంలో వైరల్‌గా మారింది.