Pawan Kalyan | కొన్నాళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తను కమిటైన సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవర్ స్టార్ ప్రస్తుతం ఓజీ సినిమా కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమాని సుజీత్ తెరకెక్కిస్తుండగా, మూవీని సెప్టెంబర్ 25న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. వీలైనంత త్వరగా మూవీ కంప్లీట్ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో జెట్ స్పీడ్ లో షూటింగ్ నిర్వహిస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా పవన్.. ముంబయిలో కనిపించారు. అక్కడే ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుండగా, పవన్ షూటింగ్ లో పాల్గొన్న విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ముంబై వీధుల్లో పవన్ కల్యాణ్ బెల్ బాటమ్ ప్యాంట్ ధరించి గ్యాంగ్‌స్టర్ గెటప్‌లో కనిపిస్తూ, అక్కడ షూటింగ్లో పాల్గొంటున్నాడు. పవన్ లుక్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఆయనకి సంబంధించిన ఫొటోలు, వీడియోలని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే వీడియోలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గెటప్ లో కనిపిస్తున్నారు. సెక్యూరిటీ మధ్య నడుచుకుంటూ వచ్చి పవన్.. కారు ఎక్కుతుండగా.. ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చినట్లు కనిపిస్తున్నారు. ముంబైలో పవర్ స్టార్ క్రేజ్ చూసి సంబరపడిపోతున్నారు. పవన్ కళ్యాణ్‌ది పాన్ ఇండియా రేంజ్ అని అంటున్నారు.
ఓజీ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుండగా, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించనున్నారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పవన్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.. ‘హరిహర వీరమల్లు’ అనంతరం విడుదలయ్యే ‘ఓజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, ఈ చిత్రం ఏ రేంజ్లో వసూళ్లు చేస్తుందో అని ఫ్యాన్స్ ముచ్చటించుకుంటున్నారు.