అమరావతి : చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ జౌళీ, చేనేత, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌ను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వీకరించారు. ‘‘ మీరు ధరించిన చేనేత వస్త్రాల ఫొటోల ను పోస్ట్ చేసి జాతీయ చేనేత దినోత్సవం రోజున మీ ప్రేమను తెలియపరచాలంటూ’’ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, పవన్ కల్యాణ్‌కు చేనేత వస్త్రాలు ధరించి ఫోటోలు పోస్ట్ చేయాలని ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ చేసిన ట్విట్‌కు పవన్ కల్యాణ్ స్పందించారు. తాను ధరించిన చేనేత వస్త్రాల ఫొటోలను ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు .
ఆయన మరో ముగ్గురు టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ నాయకుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. చేనేత దినోత్సవాన్ని నిర్వహించడం అభినంద నీయమంటూ జనసేన తరఫున చేనేత కళాకారులకు కళాభివందనాలు తెలిపారు.
కళను నమ్మినవారు అర్ధాకలితో జీవిస్తుండడం దురదృష్టకరమని అన్నారు. కళా రంగంపై లోతైన అధ్యయనం జరగాలని తెలిపారు. కళాకారులకు ప్రభుత్వం, ప్రజలు అండగా ఉండాలని కోరారు. దేశంలో ప్రతి కుటుంబం వారంలో ఒక్కసారైనా చేనేత వస్త్రాలు ధరించాలని ఆయన పిలుపునిచ్చారు. చేనేతకు నా జీవితాంతం వారధిగా నిలబడతానని వెల్లడించారు.