ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పుడు హీరోయిన్లు తమ శరీర సౌష్టవంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. పెళ్లి-పిల్లల వరకు వచ్చేసరికి శరీరాకృతిని అంతగా పట్టించుకోరు. ముఖ్యంగా, గర్భధారణ-ప్రసవం తర్వాత ఎక్కువగా బరువు పెరుగుతారు. ఈ క్రమంలో కొందరు బాడీ షేమింగ్‌కు గురవుతారు. గతంలో నేహా ధూపియా, దీపికా పదుకోన్, ఆలియా భట్ వంటి తారలు.. ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నవారే! ప్రసవం తర్వాత తమపై వచ్చిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై గళం విప్పారు కూడా. తాజాగా, తనను బాడీ షేమింగ్ చేసిన ఫొటోగ్రాఫర్ల తీరుపై మండిపడ్డది బాలీవుడ్ నటి, నిర్మాత పత్రలేఖ. ఇటీవల తన భర్త రాజ్‌కుమార్ రావుతో కలిసి ఒక ఈవెంట్‌కు హాజరైంది పత్రలేఖ.
అయితే, ఈ మధ్యే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. ఈవెంట్లో కాస్త బొద్దుగా కనిపించింది. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘ఈమెకు ఏమైంది?’ అనే క్యాప్షన్ ఇచ్చింది. తాను ఎక్కువ బరువు పెరిగినట్లు ఉద్దేశిస్తూ చేసిన ఆ వ్యాఖ్యలపై పత్రలేఖ స్పందిస్తూ.. తన ఇన్‌స్టా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. ‘నాకేమైంది అని అడుగుతారా? నేను ఇప్పుడే తల్లయ్యాను’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘అవును నిజమే! నేను బరువు పెరిగాను. ఇది మీ అందరికీ ఏదో వింతైన విషయంగా అనిపిస్తున్నట్లు ఉంది. అయితే, నేనేమీ కూర్చుని తినడం వల్ల బరువు పెరగలేదు. గర్భధారణ సమయంలో నా శరీరం స్పందించిన తీరు ఇది’ అంటూ రాసుకొచ్చింది.
ఇక తాను బిడ్డకు జన్మనివ్వడంతోపాటు అదే సమయంలో రెండు సినిమాలు కూడా నిర్మించినట్లు చెప్పుకొచ్చింది. ఇవి ఎంతో కష్టమైన పనులనీ, దయచేసి మనుషుల పట్ల కొంచెం దయగా ఉండటం నేర్చుకోవాలంటూ హితవు పలికింది. పత్రలేఖ చేసిన పోస్ట్‌కు నెటిజన్ల నుంచీ మంచి స్పందన వస్తున్నది. ఆమెకు మద్ధతుగా పలువురు కామెంట్లు కూడా పెడుతున్నారు. మేఘాలయలోని షిల్లాంగ్‌కు చెందిన పత్రలేఖ.. 2014లో వచ్చిన ‘సిటీ లైట్స్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. అదే సినిమాలో కో-స్టార్ అయిన రాజ్‌కుమార్ రావుతో మొదలైన స్నేహం.. ప్రేమగా మారింది. సుదీర్ఘకాలం ప్రేమలో ఉన్న వీరిద్దరూ 2021లో
వివాహబంధంలోకి అడుగుపెట్టారు.