న్యూఢిల్లీ: ఐపీఎల్లో మరో భారీ స్కోరింగ్ మ్యాచ్. డబుల్ ధమాకాలో భాగంగా శనివారం టేబుల్ టాపర్స్ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరులో బ్యాటర్లు దుమ్మురేపారు. లీగ్‌లో వరుస విజయాలతో ఎదురులేకుండా దూసుకెళుతున్న పంజాబ్..ఢిల్లీని ఓ ఆటాడుకుంది. లక్ష్యం ఎంతైనా వెరువని నైజంతో చెలరేగిన పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఢిల్లీపై చిరస్మరణీయ విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ మరో ఏడు బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది. యువ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌సింగ్(26 బంతుల్లో 76, 9ఫోర్లు, 5సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీకి తోడు శ్రేయాస్ అయ్యర్(36 బంతుల్లో 71 నాటౌట్, 3ఫోర్లు, 7సిక్స్‌లు), ప్రియాంశ్ ఆర్య(17 బంతుల్లో 43, 2ఫోర్లు, 5సిక్స్‌లు) పంజాబ్ రికార్డు విజయంలో కీలకమయ్యారు. ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేస్తూ బౌండరీలతో ఊచకోత కోశారు.
దీనికి చెత్త ఫీల్డింగ్‌ను ఢిల్లీ గెలుపు అవకాశాలను ఘోరంగా దెబ్బతీసింది. సరిగ్గా రెండేండ్ల క్రితం తమ పేరిటే ఉన్న 262 పరుగుల లక్ష్యఛేదన రికార్డును పంజాబ్ అధిగమించి కొత్త చరిత్ర లిఖించింది. కుల్దీప్యాదవ్(2/46) ఫర్వాలేదనిపించాడు. తొలుత కేఎల్ రాహుల్(67 బంతుల్లో 152 నాటౌట్, 16ఫోర్లు, 9సిక్స్‌లు) సూపర్ సెంచరీకి తోడు నితీశ్‌రానా(44 బంతుల్లో 91, 11ఫోర్లు, 4సిక్స్‌లు) విజృంభణతో ఢిల్లీ 20 ఓవర్లలో 264/2 భారీ స్కోరు చేసింది. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతూ రాహుల్ సాగించిన విధ్వంసం మాటలకందనిది. రానా జతగా ఢిల్లీ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది. అర్ష్‌దీప్‌సింగ్, బార్ట్లెట్ ఒక్కో వికెట్ తీశారు. భారీ సెంచరీ చేసిన రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
పంజాబ్ పరుగుల హోరు:
కండ్ల ముందు భారీ లక్ష్యం కనిపిస్తున్నా..పంజాబ్ ఏమాత్రం జడువలేదు. ఇన్నింగ్స్ తొలి బంతినే సిక్స్ కొట్టిన ఆర్య..తమ లక్ష్యమేంటో చేతల్లో చెప్పకనే చెప్పాడు. ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్..ఢిల్లీ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని ఆదిలోనే దెబ్బతీశారు. దీనికి తోడు ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ ఎంగ్డీ మైదానాన్ని వీడగా, ఆ లోటును పూడ్చే బౌలర్ లేకపోయాడు. ఇదే అదనుగా పంజాబ్ ఓపెనర్లు విధ్వంస రచనకు తెరతీశారు. అకీబ్నబీ నాలుగో ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ మూడు సిక్స్‌లు కొడితే ప్రియాంశ్ సిక్స్‌తో 27 పరుగులు వచ్చి చేరాయి. నటరాజన్ ఐదో ఓవర్లో తొమ్మిది పరుగులతో పొదుపు పాటించినా.. ముకేశ్‌కుమార్‌ను ప్రభ్‌సిమ్రన్ నాటు కొట్టుడు కొట్టాడు.
వరుసగా ఆరు బంతుల్లో ఆరు ఫోర్లతో తన విధ్వంసాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి కింగ్స్ 116 పరుగులు చేసింది. లీగ్‌లో ఇది రెండో అత్యుత్తమ స్కోరుగా రికార్డయ్యింది. ఇలా వంతులేసుకుని మరి బౌండరీలు బాదడంతో పరుగుల రాక సులువైంది. అక్షర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన ప్రియాంశ్..రిజ్వి చేతికి చిక్కడంతో తొలి వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. మరుసటి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ ఔట్ కావడం, కనోలీ(17) కూడా నిరాశపర్చడంతో పంజాబ్‌కు పరుగుల రాక మందగించింది. అయితే ఇన్నింగ్స్ బాధ్యతను శ్రేయాస్ అయ్యర్ భుజానేసుకున్నాడు.
నేహాల్ వధేరాతో కలిసి రన్‌రేట్ తగ్గకుండా లక్ష్యం వైపు సాఫీగా సాగాడు. ఎంగ్డీ స్థానంలో వచ్చిన నిగమ్ బౌలింగ్‌లో అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌ను కరణ్ నాయర్ విడిచిపెట్టడం పంజాబ్‌కు కలిసొచ్చింది. బంతి తేడాతో నాయర్ మళ్లీ క్యాచ్ మిస్ చేయడంతో అయ్యర్ దాన్ని అవకాశంగా మలుచుకుంటూరెండు భారీ సిక్స్‌లతో 26 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. వధేరా ఔటైనా..ఆఖర్లో శశాంక్సింగ్(19 నాటౌట్)తో కలిసి అయ్యర్ జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు.
కేఎల్ రాహుల్ మరోమారు స్థాయికి తగ్గ ప్రదర్శనతో కదంతొక్కాడు. సహచరులు విఫలమైన చోట తన విలువ చాటుకుంటూ నితీశ్రానాతో కలిసి ఢిల్లీకి భారీ స్కోరు అందించాడు. రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ రాహుల్ ఇదే అదనుగా రికార్డులతో కదంతొక్కాడు. పంజాబ్ బౌలర్లను ఆడుకుంటూ రాహుల్ చెలరేగడంతో పవర్‌ప్లే పూర్తయ్యేసరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. లోకల్‌బాయ్ రానా జతగా రాహుల్ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో స్కోరు టాప్‌గేర్‌లో దూసుకెళ్లింది. బార్ట్లెట్ 12వ ఓవర్లో రానా నాలుగు ఫోర్లు, రెండు భారీ సిక్స్‌లతో 28 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. మరో ఎండ్‌లో రాహుల్ కూడా జత కలుస్తూ 47 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇద్దరు పోటీపోటీగా బాదడంతో పంజాబ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. నితీశ్ ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 220 పరుగుల రికార్డు భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆఖర్లో ఫోర్‌తో 150 మార్క్ అందుకున్న రాహుల్ లీగ్‌లో ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు.
ఢిల్లీ: 264/2
పంజాబ్: 265/4
ఫోర్లు: 49
సిక్స్‌లు: 33
మొత్తం పరుగులు: 529
ఢిల్లీ: 20 ఓవర్లలో 264/2(రాహుల్ 152 నాటౌట్, రానా 91, అర్ష్‌దీప్ 1/49, బార్ట్లెట్ 1/69),
పంజాబ్: 18.5 ఓవర్లలో 265/4(ప్రభ్‌సిమ్రన్ 76, అయ్యర్ 71 నాటౌట్, కుల్దీప్ 2/46, నిగమ్ 1/24)
265/4 ఢిల్లీపై పంజాబ్
262/2 కోల్‌కతాపై పంజాబ్
247/2 పంజాబ్‌పై హైదరాబాద్
227/7 లక్నోపై బెంగళూరు
గేల్ -175*
మెక్కల్లమ్-158*
రాహుల్ -152*
కోహ్లీ, డివిలియర్స్-229
రాహుల్, రానా-220
కోహ్లీ, డివిలియర్స్-215*