వాషింగ్టన్: విలాసవంతమైన భారీ క్రూయిజ్ షిప్‌ను 40 అడుగుల ఎత్తైన అలలు కుదిపేశాయి. ఉవ్వెత్తున్న ఎగసిన అలలకు ఆ షిప్ ఊగిపోయింది. (40 foot waves slam cruise ship) దీంతో అందులో ప్రయాణించిన వారు భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంటార్కిటికా, దక్షిణ అమెరికాలోని దక్షిణ కొన మధ్య 600 మైళ్ల వెడల్పు ఉన్న సముద్ర మార్గాన్ని డ్రేక్ పాసేజ్ అని వ్యవహరిస్తారు. అట్లాంటిక్, పసిఫిక్, దక్షిణ మహాసముద్రాలు కలిసే ఈ ప్రాంతంలో భారీ ఎత్తున అలలు ఎగసిపడుతుంటాయి. దీంతో అత్యంత ప్రమాదకర మార్గంగా ఇది పేరుగాంచింది.
కాగా, 342 అడుగుల ఎత్తైన లగ్జరీ క్రూయిజ్ షిప్ ఈ భయానక డ్రేక్ పాసేజ్లో ప్రయాణించింది. దీంతో 40 అడుగుల ఎత్తైన అలలు దానిని తాకాయి. ఈ నేపథ్యంలో ఆ భారీ క్రూయిజ్ షిప్ అటూ ఇటూ ఊగిపోయింది. భారీ కుదుపులకు గురైంది. ఆ క్రూయిజ్‌లో ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందారు. అదుపుతప్పిన కొందరు కిందపడ్డారు. సుమారు 48 గంటలపాటు తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు.
మరోవైపు ఒక ట్రావెలర్ రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రెండు డ్రేక్ షేక్‌లను ఎదుర్కొన్న తాము అదృష్టవశాత్తూ బతికి బయటపడినట్లు ఆ వ్యక్తి తెలిపాడు. ఈ నౌకాయానం తన జీవితంలో మరువలేనిదని పేర్కొన్నాడు.