కారేపల్లి ,అక్టోబర్ 4: రాష్ట్ర ప్రభుత్వం రెండో పీఆర్సీ అమలుపై తీవ్ర జాప్యం చేస్తోందని, వెంటనే పీఆర్సీని ప్రకటించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇదే విధంగా కాలయాపన చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ భవన్లో నిర్వహించిన టీఎస్‌యూటీఎఫ్ ఖమ్మం జిల్లా సింగరేణి మండల 13వ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పీఆర్సీ అమలులో 40 నెలలుగా జరుగుతున్న జాప్యం గతంలో ఎన్నడూ లేనిదని విమర్శించారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారి అసంతృప్తిని తొలగించాలంటే వెంటనే పీఆర్సీని ప్రకటించడంతోపాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం సరికాదని, ఉద్యోగులు కూడా సమాజంలో అంతర్భాగమనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు
.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రెండో పీఆర్సీని ప్రకటించాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారానికి నిర్ణీత కాలపట్టిక రూపొందించి అమలు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొనసాగితే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
సమావేశంలో మండల సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా కేవీ కృష్ణారావు, ప్రధాన కార్యదర్శిగా బానోత్ మంగీలాల్, ఉపాధ్యక్షులుగా ఆర్. నాగలక్ష్మి, ఎస్. పవన్ కల్యాణ్, కోశాధికారిగా ఏటుకూరి నాగేశ్వరరావు, మండల ఆడిటర్‌గా దార రాంబాబు, ఎఫ్‌డబ్ల్యూఎఫ్ కన్వీనర్‌గా మద్దినేని నాగేశ్వరరావు ఎన్నికయ్యారు.కార్యదర్శులుగా పి. రామారావు, జి. సంతూలాల్, ఎన్. శివకోటి, కె. నరేంద్ర, ఎ. సుజాత, జి. కిరణ్, బి. బాలకృష్ణ, ఎస్. స్రవంతి, జి. వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.ఈ మహాసభలో జిల్లా నాయకులు రాందాస్, రాంబాబు, ఉద్దండ్, సురేష్‌తోపాటు నాగలక్ష్మి, ఫణికుమార్, రాములు, రమేష్, కృష్ణ, దీప, సునీత, కమల, సామ్రాజ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, లక్ష్మి, ఉషారాణి, సోమయ్యచారి, రామకృష్ణ, తులసీదాస్, మురళి, జి. హేమ తదితరులు పాల్గొన్నారు.