ఇబ్రహీంపట్నం/వికారాబాద్, డిసెంబర్ 14 : ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన, పారిశుధ్య పనుల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం గ్రామపంచాయతీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేకపోవటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 14, 15 ఆర్థికసంఘం నిధుల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు కేటాయించేందుకు నిర్ణయించింది.
సమస్యలెదుర్కొంటున్న పలు పాఠశాలల్లో ఇకనుంచి ఈ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. గ్రామపంచాయతీ నిధుల్లో పాఠశాలల్లో అభివృద్ధి, వసతుల కల్పన పనులు చేపట్టాలని ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ముఖ్యంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు, వంటగదులు, ప్రహరీ, ప్లేగ్రౌండ్స్‌తో పాటు ఇతర మరమ్మతులకు ఈ నిధులను వాడుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలలకు ఇకనుంచి మహర్దశ పట్టనున్నది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డిజిల్లాలో 560పంచాయతీల్లో 1307ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 65వేలమందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇదో చక్కటి అవకాశం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతాన్ని కూడా పెంచాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పలు పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని మారుమూల మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సమస్యలున్నాయి. ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా వెంటనే పరిష్కరించాలని పంచాయతీరాజ్‌శాఖ నుంచి ఎంపీడీవోలకు, గ్రామపంచాయతీ సర్పంచ్‌లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
14, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కేటాయింపులు
పాఠశాల విద్యను అభివృద్ధి చేయటంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో హాజరుశాతాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో 14, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కేటాయించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు పదిహేను రోజులక్రితం రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామపంచాయతీలకు ఆదేశాలను జారీచేసింది. త్వరలోనే ఈ ఆర్థిక సంఘం నుంచి గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నిధులు విడుదల కాగానే పనులు ప్రారంభించేందుకు గానూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఆయా పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిధులతో చేపట్టే పనులు ఇవే..
ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం
ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన కోసం పంచాయతీల నుంచి నేరుగా నిధులు ఖర్చుచేసే అవకాశం ఇవ్వడం ఎంతో అభినందనీయం. పాఠశాలల్లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు గానూ ప్రభుత్వం పంచాయతీల నిధులను వాడుకునే వెసులుబాటుతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించే ప్రక్రియ వేగవంతమవుతున్నది. సర్కారు నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలలకు మంచిరోజులు వచ్చాయి, నిధుల కేటాయింపు త్వరితగతిన చేపట్టాలి.
విద్యార్థుల ఇబ్బందులు తొలుగుతాయి
పాఠశాల్లో నెలకొన్న చిన్న చిన్న మరమ్మతుల వల్ల విద్యార్థులకు పెద్ద ఇబ్బందులు కలిగేవి. గ్రామ పంచాయతీల నుంచి కొంత నిధులు వెచ్చించి పనులు చేస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు ప్రధాన సమస్యలైన విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్ల వంటి సమస్యలు పరిష్కారం చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ పాఠశాలలకు మరింత కొత్తదనం చేకూరనున్నది.