సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 15: కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కిన గీత కార్మికుడు చెట్టుపైనే ఊపిరి వదిలాడు. ఈ ఘటన బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో జరిగింది. గ్రామా నికి చెందిన గీతకార్మికుడు గుగ్గిళ్ల కృష్ణయ్య (55) బుధవారం ఉదయం శివారులోని ఎల్లమ్మ గుడి వెనుక ఉన్న తాటి చెట్టుపైకి వెళ్లి కల్లు గీశాడు. కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు మోకు జారి కాళ్లకు చుట్టుకున్నది. ఈ క్రమంలో చెట్టుపైనే తలకిందులుగా వేలాడుతూ రెండున్నర గంటలపాటు నరకయాతన అనుభవించాడు. ఉదయం 10 గంటల ప్రాంతంలో గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలియజేయగా చెట్టుపైన ఉన్న కృష్ణయ్యను ఎక్స్కవేటర్ సాయంతో అతికష్టంమీద కిందికి తీసుకువచ్చారు. కాగా, కృష్ణయ్య అప్పటికే మరణించాడు. మృతుడికి భార్య పద్మ, నలుగురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.