కందుకూరు, జూలై 20 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కృషి వల్ల పచ్చదనంతో పల్లెలు మురుస్తున్నాయి. పర్యావరణం మెరుగుపడుతుంది. సకాలంలో వర్షాలు కురిసి పల్లెలు ప్రగతి పథం వైపు పయనిస్తున్నాయి. పచ్చదనం పెంచేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామానికి ఒక పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. అవి నేడు పచ్చదనంతో పల్లెలు మురిసేలా చేస్తున్నాయి. ఏడేళ్ల క్రితం గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పల్లె పకృతి వనాల్లోని మొక్కలు ఏపుగా పెరిగి అడవిని తలపిస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు పలు ప్రయోజనాలు ఆశిస్తూ ప్రభుత్వం ప్రకృతి వనాలకు శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో 35 గ్రామ పంచాయతీలు ఉండగా.. వీటన్నింటిలోనూ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రామంలో 2 వేల నుంచి 4వేల మొక్కలను నాటారు. దీనికోసం ఒక్కో ప్రకృతి వనానికి రూ.5లక్షల నుంచి 7 లక్షల వరకు ఖర్చు చేశారు. కరోనా సమయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తినా వాటిని అధికారులు, ప్రజాప్రతినిధులు అధిగమించేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పల్లె ప్రకృతి వనాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అవి ఇప్పుడు పచ్చదనానికి నిలయంగా మారాయి. దీంతో కేసీఆర్ కృషిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. ప్రకృతి వనాల మధ్య ఏర్పాటు చేసిన కాలి బాటల్లో వాకింగ్ చేస్తూ ఉదయం, సాయంత్రం సేద తీరుతున్నారు.
Palle Prakruti Vanalu1