Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ జైలు నుంచి విడుదలయ్యాడు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు పోలీసులు సూచనలను బేఖాతరు చేసినందుకు గాను హైదరాబాద్ పోలీసులు నాలుగు రోజుల క్రితం అతడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాంపల్లి కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేయగా శనివారం సాయంత్రం 6 గంటలకు చంచల్‌గూడ జైలు నుంచి బయటకు వచ్చాడు. నాంపల్లి కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేయడంతో చంచల్‌గూడ వద్ద ఎటువంటి హడావిడి లేకుండానే ప్రశాంత్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. చంచల్‌గూడ జైలు వద్ద అతడి అభిమానులు గుమిగూడినా వారితో పాటు మీడియా కంట పడకుండానే తన కారులో ఇంటికి వెళ్లిపోయాడు.
కొద్దిరోజుల క్రితమే ముగిసిన బిగ్ బాస్ ఫైనల్లో విజేతగా నిలిచిన ప్రశాంత్.. అన్నపూర్ణ స్టేడియం నుంచి బయటకు వస్తున్న క్రమంలో నానా హంగామా చేశాడు. పోలీసుల సూచనలు పాటించకుండా అభిమానులను రెచ్చగొట్టడం, ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసిన అతడి అభిమానులు వీరంగం సృష్టించారు. దీంతో పోలీసులు ప్రశాంత్‌తో పాటు అతడి తమ్ముడినీ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు ఈ ఇద్దరూ నాలుగు రోజుల పాటు జైలులోనే ఉన్నారు.
జైలు నుంచి బెయిల్ పై విడుదలైన ప్రశాంత్.. ప్రతి నెలా 1, 16వ తేదీన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని నాంపల్లి కోర్టు అతడిని ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రశాంత్‌కు బెయిల్ రావడంలో బిగ్‌బాస్‌లో ప్రశాంత్‌తో పాటు పాల్గొన్న మరో కంటెస్టెంట్, పాటబిడ్డగా ప్రాచుర్యం పొందిన బోలే అతడిని బయటకు తీసుకురావడానికి తనవంతు కృషి చేశాడని తెలుస్తోంది. ప్రశాంత్ జైలు నుంచి విడుదల కావడంతో భోలే హర్షం వ్యక్తం చేశాడు.