సినిమా విడుదల కాగానే, రేటింగ్స్ కోసం వెతికేస్తున్నారా? ఐఎండీబీ, బుక్ మై షో, రాటెన్ టొమాటోస్ తదితర సంస్థలు ఇచ్చే రేటింగ్స్ ఆధారంగా సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించుకుంటున్నారా? అయితే, మీరు మోసపోవచ్చు! ‘బుజ్జితల్లీ వచ్చేత్తన్నానే.. !!’ అన్న మాటల్లో ఏమోషన్ చూడాలి గానీ.. రేటింగ్ కాదు! ఎందుకంటే.. సినిమా రేటింగ్స్ వెనుక ఓ పెద్ద మాఫియానే నడుస్తున్నదని మీకు తెలుసా? ఈ మాఫియా ఎలా పనిచేస్తుందో, ప్రేక్షకులను ఎలా మోసం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు. సినిమా విడుదలవుతూనే పలు రేటింగ్ వెబ్సైట్లలో పాజిటివ్ లేదా నెగటివ్ రేటింగ్స్ పుంజుకోవడం మీరు గమనించే ఉంటారు. మరైతే, ఈ రేటింగ్స్ నిజమేనా? లేక డబ్బుతో నడిచే గేమా?
చాలా సినిమాల రేటింగ్స్ వెనుక పెయిడ్ రివ్యూస్ ఓ పెద్ద బిజినెస్‌గా మారింది. ఓ భారీ బడ్జెట్ మూవీని ప్రమోట్ చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ టీమ్‌లు ముందుగా హై రేటింగ్స్ అందజేస్తాయి. ఈ రేటింగ్స్ చూసి ప్రేక్షకులు థియేటర్‌కి పరుగులు పెడతారు. కానీ, కొన్ని రోజుల్లో అసలు నిజం బయటపడుతుంది! సినిమా విడుదల కాగానే, కొన్ని నిర్మాణ సంస్థలు, పీఆర్ ఏజెన్సీలు డబ్బులు ఇచ్చి మరీ రేటింగ్స్ పెంచేస్తున్నాయి. సినీ జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, బోట్స్.. ఇలా చాలామంది రేటింగ్ మాఫియాలో భాగస్వాములే అనేది కాదనలేని సత్యం. ఉదాహరణకు, ఒక పెద్ద సినిమా విడుదల కాగానే పేరొందిన సైట్ లో 5/5 రేటింగ్స్‌తో సమీక్షలు వెల్లువెత్తుతాయి. మరోవైపు ప్రత్యర్థి నిర్మాణ సంస్థలు.. ఫ్యాన్ గ్రూపులు నెగెటివ్ రేటింగ్స్ ఇచ్చి సినిమాను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాయి. ఇంకా చెప్పాలంటే.. యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తారు. బాక్సాఫీస్ కలెక్షన్లు రాకముందే సినిమా ఫ్లాప్ అని కన్ఫర్మ్ చేసేస్తున్నారు.
రేటింగ్ మాఫియా వెనుక ఫేక్ నెగెటివ్ క్యాంపెయిన్లు కూడా ఉంటున్నాయి. కొన్ని సినిమాలు విడుదలకు ముందే ఐదు పాయింట్లకుగాను ఒకటో, రెండో రేటింగ్ ఇచ్చి ముంచేస్తున్న ఫేక్ రాయుళ్లు. ఒకే వ్యక్తి వందల అకౌంట్లతో నెగెటివ్ రివ్యూస్ ఇవ్వగలడు. ఇది టికెట్ కొనాలనుకున్న ప్రేక్షకుడిపై చాలా ప్రభావం చూపుతున్నది. దీంతో మంచి సినిమాలు కూడా ప్రేక్షకుల ఆదరణ లేక డిజాస్టర్స్‌గా మిగిలిపోతున్నాయి. ఈ రేటింగ్స్ మాఫియా వల్ల ప్రేక్షకులు బకరాలైతే, నిజాయతీగా సినిమాలు తీసే దర్శకనిర్మాతలూ మునిగిపోతున్నారు. నానాటికీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గి, డిజిటల్ పైరసీ పెరుగుతున్నది. ఈ రేటింగ్ వెబ్సైట్లో బోట్ అకౌంట్స్ హవా పెరిగింది. ఇటీవల కొన్ని పెద్ద సినిమాలు విడుదల రోజు 4.5 రేటింగ్‌తో మొదలై, నాలుగు రోజుల్లో 2కి పడిపోయాయి. నిజమైన ప్రేక్షకుల కంటే, బోట్ అకౌంట్స్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. సైబర్ సెక్యూరిటీ నిపుణుల ప్రకారం.. వీటిని పూర్తిగా నిలువరించడం అసాధ్యమే! అయితే వాస్తవమైన యూజర్ రివ్యూలను గుర్తించేందుకు కొన్ని కొత్త టెక్నిక్స్‌ను వెబ్సైట్లు అమలు చేయాల్సిన అవసరమైతే ఉంది.
‘ఆన్లైన్ రేటింగ్స్ సినిమాలకు చక్కని ప్రామాణికంగా నిలవాలి గానీ, ఆడియెన్స్‌ను తప్పుదోవ పట్టించేలా ఉండకూడదు! ఒకరిపై ఒకరు రివ్యూస్‌తో దాడి చేసుకుంటే, నాణ్యమైన సినిమాలకు నష్టం!! రేటింగ్స్ కాకుండా, ట్రైలర్, మౌత్ టాక్, ఫిల్మ్ క్రిటిక్స్ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అని సూచిస్తున్నారు విశ్లేషకులు. ఫేక్ హైప్, నెగెటివ్ క్యాంపెయిన్ల వల్ల నిజమైన టాలెంట్ వెలుగులోకి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ప్రేక్షకులు సినిమా థియేటర్లో చూడాలా? వద్దా? అనేది ఆన్లైన్ రేటింగ్స్ మీద ఆధారపడి నిర్ణయించడం కరెక్టు కాదు. థియేటర్‌కు వెళ్లి సినిమా టికెట్ కొనకముందే, ఆన్లైన్ రేటింగ్ చూసి సినిమాను అంచనా వేయడం ఎంత వరకు సబబు అని ప్రేక్షకులు వేసుకోవాల్సిన ప్రశ్న! నటీనటులు నచ్చి, సంగీతం మెప్పించి, దర్శకుడి ప్రతిభపై నమ్మకం ఉండి, ట్రైలర్ ఆసక్తికరంగా ఉందనిపిస్తే.. సినిమా చూడాలన్న నిర్ణయానికి రావాలి! అప్పుడు కూడా ఎందుకులే అనిపిస్తే… చూడకపోవడం మీ ఇష్టం. అంతేకానీ, రేటింగ్స్ ఆధారంగా నిర్ణయానికి రావొద్దు.
రేటింగ్స్ చూసినప్పుడు.. ఎక్కువ శాతం 1 ఇచ్చి, ఆ వెంటనే దానికి విరుద్ధంగా 5 స్టార్ రేటింగ్స్ కనిపిస్తే… అది మానిప్యులేట్ బాపతు అని గుర్తించాలి.
కొన్ని సమీక్షల్లో సహజత్వం ఉండదు. సన్నివేశాలు, వాటి తాలుకూ భావోద్వేగాల గురించి వీటిలో ప్రస్తావించరు. సాధారణ పదజాలంతో ఏదేదో రాసేస్తారు. ఇలాంటి రివ్యూలను బోట్స్ లేదా డబ్బులు తీసుకుని రాసినవిగా అనుమానించాలి.
సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనూ రివ్యూ స్కోర్‌లో ఊహించని హెచ్చుతగ్గులు గమనిస్తే కచ్చితంగా ఫేక్ అని నిర్ణయానికి రావాలి. కామెంట్స్ వికృతంగా కనిపిస్తే.. నెగెటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని గుర్తించాలి.
నకిలీ సమీక్షలు రాసిన వ్యక్తులు, సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకోవాలి.
రివ్యూలను నమ్మి సినిమా చూడాలా? వద్దా? అనే నిర్ణయానికి రావడం సరైన విధానం కాదని ప్రేక్షకులకు అవగాహన కల్పించాలి.
సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు రేటింగ్స్‌ను నిషేధించాలి. గతంలో సినిమా విడుదలైన రెండు వారాల తర్వాతే రివ్యూలు ఇచ్చేవారు! అప్పటికి సినిమా భవిష్యత్తును ప్రేక్షకులు తేల్చేసే వారు కూడా!