హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, ప్రగతి ప్రదాత కేసీఆర్ ( KCR ) మరోసారి సీఎం కావాలని కోరుకుంటూ ఆసిఫాబాద్ ( Asifabad ) జిల్లా నుంచి బయలు దేరిన ఇద్దరు అభిమానులు పాదయాత్రగా గురువారం ఎర్రవెల్లికి చేరుకున్నారు. నమ్మి మోసపోయి కాంగ్రెస్ ముసుగులో నాశనగాలాన్ని కొని తెచ్చుకున్న పాపానికి విముక్తి కలగాలంటే ‘ కేసీఆర్ పాలన కావాలే.. కేసీఆర్ మల్లా ముఖ్యమంత్రి ( Chief Minister ) గా రావాలే అని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షిస్తున్నారని చెప్పడానికి ఇద్దరు ఆదివాసి యువకులే ఆదర్శం.
ఆసిఫాబాద్ నియోజకవర్గం వాంకిడి నుంచి దాదాపు 300 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జాడే తిరుపతి (ఆటో డ్రైవర్) దుర్గం శంకర్ (హోటల్ కార్మికుడు) అనే ఇద్దరు గిరిజన ఆదివాసీ బిడ్డలు( Adivasi Youths) 11 రోజులుగా రోజుకు సగటున 25 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సహకారంతో కేసీఆర్ ను కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని సాదరంగా ఆహ్వానించి యోగ క్షేమాలు తెలుసుకుని, వారి నిస్వార్థ సంకల్పానికి అధినేత భుజం తట్టి అభినందించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే అంకితభావంతోనే సుదీర్ఘ ప్రయాణం చేసినట్లు వారు వెల్లడించారు. ‘మళ్లా మన ప్రభుత్వం వస్తున్నది. అప్పుడు తప్పకుండా నన్ను వచ్చి కలవండి’ అంటూ వారి భుజం తట్టారు. అనంతరం వారికి వీడ్కోలు పలికిన కేసీఆర్ వారి కోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయడంతో సొంత ఊరికి బయలుదేరారు.