ముంబై, ఆగస్టు 16: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ-పీర్ టు పీర్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ (ఎన్బీఎఫ్సీ-పీ2పీ రుణ వేదికలు)ల్లో పారదర్శకతను పెంచడం కోసం ఆర్బీఐ శుక్రవారం నిబంధనల్ని కఠినతరం చేసింది. సవరించిన మాస్టర్ డైరెక్షన్ ప్రకారం పీర్ టు పీర్ లెండింగ్‌ను టెన్యూర్ లింక్డ్ అష్యూర్డ్ మినిమం రిటర్న్స్, లిక్విడిటీ ఆప్షన్స్ వంటి ఫీచర్లతో ఓ పెట్టుబడి ప్రొడక్ట్‌గా పీ2పీ ప్లాట్‌ఫామ్స్ చూపకూడదు. అలాగే రుణ పెంపు, రుణ భరోసాలకు వీలున్న ఏదైనా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ క్రాస్-సెల్లింగ్‌కూ వీల్లేదు. నిబంధనలకు విరుద్ధంగా రుణాలనూ మంజూరు చేయకూడదు. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొన్ని సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తున్న నేపథ్యంలోనే ఈ సవరణలు చేసింది.
అరబిందో ఫార్మాకు యూఎస్ఎఫ్డీఏ షాక్
హైదరాబాద్, ఆగస్టు 16: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మాకు అమెరికా నియంత్రణ మండలి షాకిచ్చింది. అరబిందోకు చెందిన సబ్సిడరీ సంస్థయైన యుగియా ఫార్మా స్పెషలిస్ట్ లిమిటెడ్‌కు రాష్ట్రంలోవున్న యూనిట్‌కు అధికారిక చర్యను కొనసాగిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి హెచ్చరిక లేఖ జారీ చేసినట్లు అరబిందో ఫార్మా బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ హెచ్చరిక లేఖ ఎందుకు జారీ చేసింది మాత్రం సంస్థ వెల్లడించలేదు. ఈ లేఖతో అమెరికా మార్కెట్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని పేర్కొంది. హైదరాబాద్‌కు సమీపంలోని పాశమైలారం వద్ద ఉన్న యూనిట్‌ను జనవరి 22 నుంచి ఫిబ్రవరి 2 వరకు యూఎస్ఎఫ్డీఏ ఉన్నతాధికారులు తనిఖీ చేశారు.
భద్రతా దళాలకు ఎల్ఐసీ హౌజింగ్ ఆఫర్
ముంబై, ఆగస్టు 16: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశీయ భద్రత దళాలకు ఎల్ఐసీ హౌజింగ్.. గృహ రక్షక్ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.2 కోట్ల లోపు గృహ రుణం తీసుకునేవారికి 8.40 శాతం వడ్డీకే రుణాలు అందిస్తున్నది. సిబిల్ స్కోర్ 750కి పైగా ఉన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనున్నదని పేర్కొంది. ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా ఎత్తివేసిన బ్యాంక్..ఈ ప్రత్యేక స్కీం సెప్టెంబర్ చివరి వరకు అందుబాటులో ఉండనున్నదని పేర్కొంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్ట్ గార్డ్ విభాగాల్లో పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన భద్రత దళాలు అర్హులని తెలిపింది.
ఫారెక్స్ రిజర్వులు డౌన్
ముంబై, ఆగస్టు 16: రికార్డు స్థాయికి చేరుకున్న విదేశీ మారకం నిల్వలు భారీగా పతనం చెందాయి. ఈ నెల 9తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 4.8 బిలియన్ డాలర్లు తగ్గి 670.119 బిలియన్ డాలర్లకు పడిపోయాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలో రిజర్వులు 7.533 బిలియన్ డాలర్లు పెరిగి చారిత్రక గరిష్ఠ స్థాయి 674.919 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ తరిగిపోవడం ఇందుకు కారణమని తెలిపింది. అలాగే గోల్డ్ రిజర్వులు కూడా 860 మిలియన్ డాలర్లు తగ్గి 59.239 బిలియన్ డాలర్లకు తగ్గినప్పటికీ, ప్రత్యేక డ్రాయింగ్ రైట్స్ 121 మిలియన్ డాలర్లు పెరిగి 18.282 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు తెలిపింది.