
ఉప్పల్జోన్ బృందం, డిసెంబర్ 20: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రం తీరుకు నిరసనగా సోమవారం నియోజకవర్గంలోని పలు డివిజన్ల ప్రధాన కూడళ్ల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఉప్పల్, చిలుకానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, నాచారం, మల్లాపూర్, హెచ్‌బీకాలనీ, చర్లపల్లి, ఏఎస్‌రావునగర్, కాప్రా డివిజన్ పరిధిలో పార్టీ కార్యకర్తలు, నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. తెలంగాణలో వడ్లు కొనుగోలు చేసే విషయంలోకేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రామంతాపూర్ పబ్లిక్ స్కూల్ వద్ద కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ప్రధాన మంత్రి మోదీ దిష్టిబొమ్మను దహ నం చేశారు. కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు.
రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడుతాం : ఎమ్మెల్యే
రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్రంపై పోరు కొనసాగిస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రంపై ఉద్యమిస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులకు న్యాయం జరిగేవరకు పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిని ఎండగడతామన్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తుందని అన్నారు.