
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణతో అమెరికాది బలమైన బంధమని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్‌మన్ అన్నారు. ‘పైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్‌లో 2018లో మేం యూఎస్ కాన్సులేట్ కొత్త భవన నిర్మాణాన్ని మొదలుపెట్టాం. విద్యుత్తు ఆదా, వర్షపు నీటి వినియోగం, సహజ శిలల సంరక్షణతో పాటు విలక్షమైన ప్రకృతి దృశ్యాలను అందించే స్థానిక మొక్కలను సంరక్షిస్తూ అధునాతన సాంకేతికత, స్థానికంగా లభించే వనరులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నాం. హైదరాబాద్‌తో యునైటెడ్ స్టేట్స్కు ఉన్న బలమైన సంబంధాలకు ఇది ప్రతిరూపంగా నిలుస్తుంది. ఇప్పటికే అమెరికాకు చెందిన కంపెనీలు అమెజాన్, మైక్రోసాప్ట్, గూగుల్, ఆపిల్, ఫేస్బుక్, బోయింగ్, లాక్హిడ్ మార్టిన్ లాంటివి ఎన్నో వచ్చాయి. ఎందుకంటే హైదరాబాద్‌లో అంతర్జాతీయ వ్యాపారాలకు అనువైన వరల్డ్ క్లాస్ ఎన్విరాన్మెంట్ ఉన్నది. ప్రపంచబ్యాంకు ఇచ్చే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్‌లో 2016 నుంచి తెలంగాణ టాప్-3లో కొనసాగుతున్నది. రానున్న రోజుల్లో తెలంగాణతో అమెరికా సంబంధాలు మరింత మెరుగవుతాయని నమ్ముతున్నా. అందుకే అద్భుతమైన కొత్త కాన్సులేట్‌ను ఇక్కడ నిర్మిస్తున్నాం. 2022 చివరి నాటికి దీన్ని ప్రారంభిస్తాం’ అని ఓ వీడియోను శనివారం ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ‘తెలంగాణ ప్రగతిశీల విధానాలకు ఆమోదం తెలిపినందుకు, భారత్‌తో యూఎస్ఏ సంబంధాల్లో తెలంగాణ కీలక పాత్రను పునరుద్ఘాటించినందుకు జోయెల్ రీఫ్మన్కి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు.