హైదరాబాద్: ఆల్ ఇండియా ఇంటర్యూనివర్సిటీ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఉస్మానియా జట్టు స్వర్ణ పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఉస్మానియా 3-2 తేడాతో గుజరాత్ యూనివర్సిటీపై అద్భుత విజయం సాధించింది. భువనేశ్వర్‌లోని కేఐఐటీ వేదికగా జరిగిన టోర్నీలో సాయికార్తీక్ రెడ్డి కెప్టెన్సీలో బరిలోకి దిగిన ఉస్మానియా అద్భుత ప్రదర్శన కనబరిచింది. తొలుత సింగిల్స్‌లో కార్తీక్ 6-0, 6-2తో మోహిత్ బాంద్రెపై అలవోక విజయం సాధించాడు. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా కార్తీక్ వరుస సెట్లలో మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మిగతా మ్యాచ్‌ల్లో సుహిత్రెడ్డి(ఉస్మానియా) 6-4, 4-6, 4-6తో రుద్ర భట్ చేతిలో ఓడాడు. డబుల్స్‌లో ఉస్మానియా ద్వయం ఆకాశ్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి 2-6, 4-6తో మోహిత్, రుద్ర జోడీ చేతిలో పరాజయం ఎదుర్కొంది. అయితే రివర్స్ సింగిల్స్‌లో కార్తీక్ 6-7, 6-1, 6-1తో రుద్రపై, సుహిత్రెడ్డి 6-2, 6-4తో మోహిత్‌ను ఓడించడంతో ఉస్మానియా విజయం ఖరారైంది.