సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : విద్యా విషయిక పరిశోధనలను మరింత పటిష్టం చేయడంపై ఉస్మానియా యూనివర్సిటీ దృష్టి సారించింది. అకడమిక్ పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడం, సమాజానికి ఉపయోగపడేలా ఏ విధంగా పరిశోధనా అంశాలను ఎంపిక చేసుకోవాలన్న పలు రకాల అంశాలపై పరిశోధన విద్యార్థులకు, ఫ్యాకల్టీని సమగ్ర విధానంలో తీర్చిదిద్దడం కోసం ఓయూలో సరికొత్తగా అకడమిక్ రీసెర్చ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో ఈ అకడమిక్ రీసెర్చ్ సెంటర్ కొనసాగనుంది. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవిందర్ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
కొంతమంది పరిశోధనా విద్యార్థులు తమ ప్రాజెక్టులకు సంబంధించి పాత థీసిస్లలో ఉన్న అంశాలనే కాపీ కొడుతుంటారు. లేక అవే అంశాలను రాసి డూప్లికసీ చేసి యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తుంటారు. అలాంటి పాత విధానాలకు స్వస్తి పలికి ప్రమాణాలు పెంచేలా ఏఆర్సీ మరిన్ని చర్యలు తీసుకోనుంది. ప్రాజెక్టుపై అధ్యయనం చేయనున్న పరిశోధకులందరికీ ముందుగానే నిబంధనలు వివరిస్తారు. కాపీ చెల్లదని, డూప్లికసీని అంగీకరించబోమని.. స్టడీ ప్రాజెక్టును అప్పగించే సమయంలోనే వారికి మార్గదర్శకాలు సూచిస్తారు. ఐఐటీ, ఎన్ఐటీలు, కేంద్రీయ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లతో ప్రాజెక్టుల వారీగా దిశా నిర్దేశం చేస్తుంది. నిపుణులతో శిక్షణ ఇప్పిస్తుంది. పరిశోధకులకు కావాల్సిన నిధుల సమీకరణ విషయంలో సహాయం చేస్తుంది. ఫండింగ్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతుంది.
యూనివర్సిటీ విద్యార్థులు, ఫ్యాకల్టీ.. పరిశోధనలు అంశాలను ఏయే కోణాలలో ఎంపిక చేసుకోవాలి? అందుకోసం ఎలాంటి విధానాలు అవలంభించాలి? ఒకరు చేసిన పరిశోధన మరొకరు చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు పరిశోధనలు ఏ విధంగా చేయాలి ? వంటి సమగ్ర వివరాలను అకడమిక్ రీసెర్చ్ కమిటీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పరిశోధకులకు ఎప్పటికపుడు సమాచారం అందించనున్నారు. ఎవరెవరు ఏ అంశాలను ఎంపిక చేసుకున్నారో ఆ వివరాలు కూడా ఫ్యాకల్టీకి ఎప్పటికప్పుడు తెలియచేయనున్నారు. పరిశోధకులకు ఎప్పటికప్పుడు అవగాహన తరగతులు నిర్వహించనున్నారు. వారికి ట్రెండింగ్ ప్రకారం దిశా నిర్దేశం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరామ్వెంకటేశ్ తెలిపారు.
పరిశోధనా ప్రాజెక్టుల ఎంపిక విషయంలో పారిశ్రామిక వేత్తలను భాగస్వాములను చేయనున్నారు. పరిశ్రమలు అందించే సలహాలు, సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. పరిశ్రమల రంగంలో చోటు చేసుకుంటున్న కొత్త పోకడలు, చోటు చేసుకుంటున్న మార్పులు, భవిష్యత్ అవసరాలు వంటి విషయాలపై కూడా రీసెర్చ్ సబ్జక్టు ఎంపిక చేసుకునేలా ఏఆర్సీ చొరవ తీసుకొని సహకరిస్తుంది. ప్రాజెక్టుల కోసం దరఖాస్తు చేసుకునే దశ నుంచి పూర్తి చేసి థీసిస్ సమర్పించే వరకు ఆయా దశల్లో చేయూతనందించనుంది. ఏఆర్సీ కమిటీ అటు ఫ్యాకల్టీకి ఇటు పరిశోధనా విద్యార్థులకు ఎప్పటికప్పుడు చేదోడువాదోడుగా వ్యవహరించనుందని ఓయూ అధికారులు అభిప్రాయపడుతున్నారు.