హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): 117 ఏండ్ల కింద నిజాం నవాబు మీర్ఉస్మాన్ అలీఖాన్ ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను నిర్మించి మూసీ వరదలను నిలవరిస్తే.. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి జంట చెరువుల్లోని గేట్లను ఏకకాలంలో ఎత్తి.. హైదరాబాద్‌ను అతలాకుతలం చేశారు. జంట జలాశయాల నుంచి భారీగా పోటెత్తిన వరద నగరంలోని అనేక ప్రాంతాలను జలదిగ్భంధం చేసింది. మూసీ పరివాహక పాంతంలోని ప్రజానీకం నీట మునిగిపోతారనే సంకేతాలు పంపడానికే సీఎం రేవంత్‌రెడ్డి వరదోత్పాతం సృష్టించారనే ప్రచారం జరుగుతున్నది.
మూసీ మీద వరద నీరు విస్తరించిన మేరకు డ్రోన్ వీడియోలు, ఛాయా చిత్రాలు తీసీ, రేపటి నుంచి వాటిని ప్రదర్శించుకుంటూ తమను భయపెట్టడం కోసమే రేవంత్‌రెడ్డి ఒక్కసారిగా గేట్లు ఎత్తారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఒక పక్క ఎడతెగని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలమండలి అధికారులు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే హిమాయత్‌సాగర్ నుంచి 6 గేట్లు ఎత్తి 6,000 క్యూసెకుల నీటిని ఉస్మాన్‌సాగర్ నుంచి 11 గేట్లు ఎత్తి 8,000 క్యూసెకుల నీటిని మూసీలోకి వదిలారు. దీంతో మూసీ నది హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తింది. 1908 సెప్టెంబరు 28న మూసీ ప్రళయం సృష్టించింది. హైదరాబాద్ నగరాన్ని మూసీ ముంచెత్తింది.
నగరం అతలాకుతలమైంది. అప్పటి వరదల్లో 15 వేల మంది మరణించారు. మాసీ వరదలను కట్టిడి చేయాడానికి 1912లో నిజాం చొరవతో సిటీ ఇంప్రూవ్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. 1920లో ఉస్మాన్‌సాగర్ ఆనకట్ట,1927లో హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ కట్టించారు. ఇక అప్పటి నుంచి మూసీ వరదలకు ముకుతాడు వేసినట్టయింది. అప్పుడప్పుడు వరదలు వచ్చినా.. భారీ ప్రమాద స్థాయికి చేరలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట అదును చూసి, ప్రజల మీదికి మూసీ నదిని వదిలిందనే ప్రచారం జరుగుతున్నది.