హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తేతెలంగాణ): ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్ల విలువైన సేంద్రియ వ్యవసాయ ప్రాజెక్టు లభించింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా ఈ ప్రాజెక్టుకు అనుమతి లభించినట్టు వర్సిటీ వీసీ డాక్టర్ వీ ప్రవీణ్‌రావు ప్రకటించారు. దీనికి అవసరమైన ల్యాబ్స్ యూనివర్సిటీలో సిద్ధంగా ఉన్నాయని, స్థలం గుర్తింపు కూడా పూర్తయిందని తెలిపారు. వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్’ ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సును పూర్తిచేసిన తొలి బ్యాచ్ అభ్యర్థులకు మంగళవారం ఆన్లైన్లో సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ప్రస్తుతం రెండవ బ్యాచ్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని, మార్చి 1 నుంచి శిక్షణ మొదలవుతుందని వీసీ ప్రవీణ్‌రావు తెలిపారు. ఈ ఏడాది నుంచి వసతులున్నచోట సేంద్రియ వ్యవసాయంలో ఎంఎస్సీ కోర్సును ప్రారంభించేందుకు ఐసీఏఆర్ అనుమతి ఇచ్చినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో వర్సిటీ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, డీన్ పీసీ స్టడీస్ డాక్టర్ అనిత, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్గానిక్ ఇండస్ట్రీ చైర్మన్ రాజ్శీలంరెడ్డి, సీఈవో డాక్టర్ పీవీఎస్ఎం గౌరి తదితరులు పాల్గొన్నారు.