Orannge Movie | రామ్ చరణ్ నటించిన డిజాస్టర్ మూవీస్‌లో ఆరెంజ్ చిత్రం ఒకటి. ఈ మూవీ చాలా నష్టాలు తెచ్చినప్పటికీ కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. ఈ చిత్రంతో నాగబాబు నష్టాలలో కూరుకున్న విషయం మనందరికి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో రామ్ చరణ్ సరసన జెనీలియా కథానాయికగా నటించింది. మరో హీరోయిన్ గా షాజన్ పదంసీ కూడా నటించింది. ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ ప్రియురాలు రూబాగా తనదైన నటనతో మెప్పించింది షాజన్. ఇందులో ఆమె క్యూట్ లుక్స్ కుర్రకారుకి కంటిపై నిద్ర లేకుండా చేశాయి.
అయితే మోడల్ గా కెరీర్ ప్రారంభించిన షాజన్ పదంసీ రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అనే సినిమాతో చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత కనిమొళి అనే తమిళ చిత్రంలో నటించి మెప్పించింది. దిల్ తో బచ్చా హై జీ, హౌస్‌ఫుల్ 2 వంటి హిందీ సినిమాల్లోనూ మెరిసిన ఈ భామ ఆరెంజ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఈ సినిమా ఫ్లాప్ అయిన కూడా ఈ బ్యూటీకి ఆఫర్స్ బాగానే వచ్చాయి. ఆ తర్వాత రామ్ పోతినేని, విక్టరీ వెంకటేశ్ హీరోలుగా నటించిన మసాలా సినిమాలోనూ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో సినిమాలకి కాస్త దూరమైంది. 2015లో సాలిడ్ పటేల్స్ అనే హిందీ సినిమాలో నటించిన షాజన్ దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత 2023లో పాగల్పన్: నెక్స్ట్ లెవల్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి అలరించింది.
ఇక వీలున్నప్పుడల్లా వెబ్ సిరీస్‌లలోను నటిస్తూ అలరిస్తుంది. అయితే షాజన్ పదంసీ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. తన ప్రియుడు, వ్యాపార వేత్త ఆశిష్ కనకియాని జూన్‌లో వివాహం చేసుకోనుంది. గతేడాది నవంబర్‌లో.. ఆశిష్ తనకు ప్రపోజ్ చేయగా, షాజన్ యాక్సెప్ట్ చేసినట్టు పేర్కొంది. ఇక ఈ ఏడాది జనవరిలో వీరి రోకా వేడుక గ్రాండ్‌గా జరిగింది. వాటికి సంబంధించిన ఫొటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.