న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఒరాకిల్ ఇటీవలి సంవత్సరాల్లో అతి భారీ ఉద్యోగాల కోతను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. తెల్లవారుజాము ఈమెయిల్స్ ద్వారా ఉద్యోగులకు కంపెనీ ఈ నిర్ణయాన్ని తెలియచేసింది. అమెరికా, భారత్, కెనడా, లాటిన్ అమెరికాలో పనిచేసే ఒరాకిల్ ఉద్యోగులకు ఈ ఉద్వాసన వర్తిస్తుంది. తొలగింపు స్థాయి విస్తృత చర్చకు దారితీసింది. కేవలం సంఖ్యల కారణంగానే కాదు. ఎందుకంటే చాలా కాలంగా పనిచేస్తున్న అధిక నైపుణ్యంగల ఉద్యోగులు చాలామంది ఈ నిర్ణయంతో ప్రభావితమయ్యారు. ఒరాకిల్‌లో 33 ఏండ్లకు పైగా పనిచేసిన సీనియర్ సెక్యూరిటీ నిపుణురాలు నీనా లూయిస్‌ను కూడా కంపెనీ ఏప్రిల్ 1న తొలగించింది. ఒరాకిల్‌లో 30 ఏండ్లకు పైగా పనిచేసిన నేను ఈ రోజు ఉద్యోగాలు కోల్పోయిన సుమారు 30,000 మందిలో చేరాను అని ఆమె లింక్డ్ఇన్లో రాశారు. ఈ చర్య తనను దిగ్భ్రాంతికి గురిచేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఒరాకిల్‌లో కోతలు అరుదైన సంఘటనేమీ కాదు. గత నెలలోనే మెటా, మైక్రోసాఫ్ట్, డిస్నీ, ఏఎస్ఎంఎల్ వంటి కంపెనీలు కూడా ఉద్యోగ కోతలను ప్రకటించాయి. ఇటీవలి వారాలలో మెటా, మైక్రోసాప్ట్లో కలిపి 20,000 పైగా ఉద్యోగ కోతలు జరిగినట్లు మీడియా వార్తలు తెలిపాయి. టెక్, ఎంటర్టైన్మెంట్, సెమీకండక్టర్ సంస్థలలో ఈ కోతలు చోటుచేసుకున్నాయి. లాభాలతో నడుస్తున్న కంపెనీలు సైతం సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి.
కంపెనీలు కృత్రిమ మేధ(ఏఐ)లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అవి పని విధానాలను స్యయంచాలకం చేస్తున్నాయి. అవి టీమ్‌లను పునర్వ్యవస్థీకరిస్తున్నాయి. దీని వెనుక ఉన్న ఉద్దేశం చాలా సులభం. ఎక్కువ సామర్థ్యం, ఎక్కువ పెట్టుబడి వ్యయం, అధిక లాభాలు. ఆటోమేషన్ పెరిగినపుడు ఉద్యోగుల సంఖ్య తరచుగా తగ్గుతుంది. పెట్టుబడిదారులు దీనిని ప్రోత్సహిస్తారు. ఉద్యోగ కోతల ప్రకటనల తర్వాత తరచుగా షేర్ ధరలు పెరుగుతాయి. తక్కువ వేతనాలు మెరుగైన లాభదాయకతకు సంకేతం. అది పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రోత్సహిస్తుంది. అయితే కార్యాలయాల లోపల ఆందోళన పెరుగుతున్నది. ఏఐ సాధనాల సామర్థ్యం పెరుగుతుండడంతో రొటీన్ కోడింగ్, టెస్టింగ్, ఆపరేషన్స్‌కు సంబంధించిన ఉద్యోగాలపై ఒత్తిడి పెరుగుతున్నది.
జూనియర్లే కాదు సీనియర్ ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. లాభదాయకతను పెంచుకునే ప్రయత్నంలో అధిక జీతాలు పొందే ఉద్యోగులు తమకు అవసరమా లేదా అని కంపెనీలు పునఃసమీక్షిస్తున్నాయి. లేనిపక్షంలో వారి స్థానంలో ఏఐ, తక్కువ జీతం తీసుకునే యువ ఉద్యోగులను నియమిస్తున్నాయి. అదే సమయంలో ప్రవేశ స్థాయి ఉద్యోగాలు పూర్తిగా ఆటోమేషన్ చేస్తున్నారు.